Wednesday 10 December 2014

ఆరునెలల అడియాసలు..

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయనపై ఎన్నో ఆశలు! విభజన నేపధ్యంలో చుట్టుముట్టిన సమస్యల వలయం నుండి రాష్ట్రాన్ని బయటపడే స్తారని ప్రజానీకం ఆశించారు. .  ఉధృతంగా సాగిన ఈ ప్రచారంతో ప్రజానీకం టిడిపికి పట్టం కట్టారు.
ప్రజానీకం పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కారు ప్రయాణం చేస్తున్న తీరు క్లుప్తంగా :
రుణమాఫీ
           ఎన్నికల ప్రచారంలో వ్యవసాయరుణా లన్నింటిని మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత, డ్వాక్రా రుణాలనూ రద్దు చేస్తామని ప్రకటించారు. . ప్రమాణస్వీ కారం నాడు మాఫీ ఫైలుకు బదులుగా విధివిధానాల కోసం కోటయ్య కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై బాబు సంతకం చేశారు. ఆ తరువాత వ్యవసాయ రుణాలు కాస్తా పంటరుణాలుగా మారాయి. కుటుంబానికి 1.50 లక్షల రూపాయలకే పరిమితి విధించారు. ఆధార్‌, రేషన్‌, ఓటర్‌కార్డులంటూ ఆంక్షలు పెట్టి లబ్ధిదారుల జాబితాను సగానికి తగ్గించివేసింది. నాలుగురోజుల క్రితం చేసిన విధాన ప్రకటనలో కుటుంబానికి 50 వేల రూపాయలు రుణం ఉన్న వారికే తక్షణం మాఫీ వర్తిస్తుందని చెప్పారు. లబ్ధిదారుల జాబితాను జన్మభూమి సభల్లో ఖరారు చేయాల్సిఉంది. ఆ ప్రక్రియ ముగిసి, బ్యాంకర్లకు నగదు చేరితేకాని ఎందరికి లబ్ధి చేకూరిందన్న విషయంపై స్పష్టత రాదు. ఇక డ్వాక్రా, చేనేత రుణ మాఫీల గురించి మాట్లాడటానికి కూడా ప్రభుత్వం సిద్దపడటం లేదు.
రాజధాని
              సింగపూర్‌ తరహాలో ప్రపంచస్థాయి రాజధానిని తీర్చిదిద్దుతామని, ప్రజా రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు పదేపదే చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తరువాత క్రిడా (కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-సిఆర్‌డిఎ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో రాజధానికి భూముల కోసం సమీకరణ విధానాన్ని ముందుకు తెచ్చిన ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను తుంగలో తొక్కే దిశలో పయణిస్తోంది. .ఈ ప్రక్రియలో స్థానికుల నుండి వస్తున్న వ్యతిరేకతను బేఖాతరు చేస్తోంది. వ్యవసాయకార్మికలు,కౌలురైతులు, ఇతర వృత్తుల వారి ఊసును విస్మరిస్తూ కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తోంది.రాజధాని నిధుల విషయంలోనూ ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఫించన్ల కోత
                అధికారంలోకి వచ్చిన 100రోజుల తరువాత ఫించన్ల పెంపు ప్రకటనను ప్రభుత్వం చేసింది. అదే సమయంలో పలు ఆం క్షలను, విధించింది. వృధ్దాప్య ఫించన్ను కుటుంబానికి ఒకరికే పరిమితం చేసింది. అనర్హుల పేరుతో పెద్దఎత్తున కోత పెట్టింది. ఫించను రాదని తెలుసుకున్న కొందరు వృధ్ధులు జన్మభూమి సభల్లోనే ప్రాణాలు విడిచారు.
ప్రత్యేకహోదా ...
              కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైనప్పటికీ ఆరునెలలు గడిచినా ఆ దిశలో సానుకూల నిర్ణయం వెలువడలేదు..  ప్రత్యేకహోదాతో పాటు పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజిలు, నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది.
అన్న క్యాంటిన్లు ... సుజల స్రవంతి
                 పేదవాడికి తక్కువ ధరకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రకటించిన అన్నక్యాంటిన్లు ఎప్పుడు ఏర్పాటవుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. నివేదికలు సిద్దమయ్యాయి కానీ, అమ లుకు తెచ్చే విషయంలో సర్కారు సాచివేత ధోరణి తో వ్యవహరిస్తోంది. ప్రమాణస్వీకారం నాడే సంత కం చేసిన ఎన్‌టిఆర్‌ సుజల స్రవంతిదీ ఇదే బాట.
'బెల్టు' తీసి షాపులు పెట్టారు
               ప్రమాణస్వీకార సభలో బెల్టుషాపులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఫైలుపై సంతకం కూడా చేశారు. ఆచరణలో వాటి స్థానంలో అధికారికంగా మద్యం షాపులకు అనుమతిచ్చారు. మద్యం షాపులను విపరీతంగా పెంచారు. మండల, గ్రామ స్థాయిలో కూడా జనాభా సంఖ్యను బట్టి షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిరుద్యోగులకు నిరాశే!
                 ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆచరణలో ఉన్న ఉపాధిని ఊడగొట్టే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. అంగన్‌వాడీలు, మధ్యాహ్నాభోజన కార్మికుల ఉపాధి ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితి నెలకొంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

No comments:

Post a Comment