Tuesday 1 September 2015

ఉద్యమ విజయం..

భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన వివాదాస్పద సవరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించుకోవడం రైతుల ప్రతిఘటనకు విజయం. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా, పార్లమెంట్‌ ప్రక్రియను కాదని అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) జారీ చేసి, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చనుకున్న బిజెపి సర్కారు కుటిల పన్నాగం బెడిసికొట్టింది. సోమవారంతో కాలం తీరిపోతుందన్న ఆర్డినెన్స్‌ స్థానంలో మరో ఆర్డినెన్స్‌ జారీ చేయబోమని ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించిన 'మన్‌కీ బాత్‌'లో ప్రధాని చేసిన ప్రకటన సాదాసీదాగా రాలేదు. రైతుల నుంచి మిన్నంటుతున్న నిరసనలు, ప్రతిపక్షాల ఐక్య ప్రతిఘటనల ఉక్కిరిబిక్కిరికి తాళలేకనే చివరి నిమిషంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేటు పెట్టుబడులకు భూసేకరణ చట్టం ప్రతిబంధకంగా ఉందంటూ కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కార్పొరేట్లకై ఆర్రులు చాస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వంటివి సైతం భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలనడంతో మోడీ సర్కారు దూసుకెళ్లింది. రాజ్యసభలో ఎన్‌డిఎకు మెజార్టీ లేదని తెలిసినా ఎనిమిది మాసాల్లో మూడుసార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేసి పార్లమెంట్‌ ప్రతిష్టను మంటగలిపింది. సభ సమావేశం కాని రోజుల్లో ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు జారీ చేస్తాయి. ఆరునెలల్లోపు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందితేనే అవి చట్టాలవుతాయి. లేకపోతే కాలం చెల్లిపోతాయి. ఈ చిన్న విషయం 'వికాస పురుషుడి'కి తెలియకేంకాదు. నయానో భయానో మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను లోబర్చుకొని గట్టెక్కవచ్చనే ఆలోచనతోనే మోడీ సర్కారు ఒకసారి కాదు మూడుసార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ మెజార్టీ లేని రాజ్యసభలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాలతోపాటు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకించడంతో చేసేదిలేక సవరణలకు మోడీ 'రాంరాం' చెప్పారు. అసలు వాస్తవం ఇది తప్ప రైతులపై ప్రేమ ఉండి కాదు.