Friday 28 August 2015

భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?

రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా సింగపూర్‌ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల తంతు జరుగుతోంది. రాజధాని ముసుగులో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. అలాగే కృష్ణానదిలోని లంకలతోపాటు, గోల్ఫ్‌కోర్సు, విలాసవంతమైన విల్లాలు, క్లబ్బులు, హోటళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రజా రాజధాని కోసమే భూమిని సేకరించేటట్లయితే ఇవన్నీ ఎందుకనే ప్రశ్న ఉదయించకమానదు. విదేశీ కంపెనీల వ్యాపారం కోసం రైతుల భూములు త్యాగం చేయాలా? ఇదేనా రాజధాని నిర్మాణం?
2013లో ప్రజల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా సవరించడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. దీనికోసం అడ్డదారిలో ఆర్డినెన్సులూ జారీచేసింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. ప్రజల ప్రతిఘటనతో పార్లమెంటులో భూ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాల్సొచ్చింది. కొద్దికాలంలో చెల్లిపోయే ఈ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం జీవో 166ను తెచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు బలవంతంగా భూములను కాజేస్తోంది. ఇది నైతికంగా చెల్లదు. 2013 చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను సేకరించరాదు. రాజధానిలో ఉన్న భూముల్లో సంవత్సరం పొడుగునా కూరగా యలు, ఆకుకూరలు, పళ్లు పండుతాయి. చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా భూమి సేకరించరాదనే నిబంధన లున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలకు 70 శాతం, ప్రయివేటు ప్రయోజనాల కోసం 80 శాతం రైతుల ఆమోదం పొందా ల్సుంది. సామాజిక ప్రభావ అంచనా నివేదిక రూపొందించ కుండా భూములు సేకరించ రాదని చట్టం చెబుతోంది.
- సిహెచ్‌ బాబూరావు

Monday 17 August 2015

స్మార్ట్‌ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం


అసలు స్మార్ట్‌ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని మార్గదర్శకాల ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్దిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అవి అవసరాలకు సరిపడా నీటిసరఫరా, నిరంతర విద్యుత్‌ సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం, ప్రజారవాణాతో సహా సమర్థవంతమైన రవాణా సదుపాయాలు, భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం, బలమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటలైజేషన్‌, సుపరిపాలన ముఖ్యంగా ఈ-గవర్నెన్స్‌- ప్రజల భాగస్వామ్యం, మంచి పర్యావరణం, పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ, విద్య, వైద్యం. వీటిని గమనిస్తే కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి. క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం. వీటిని అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్‌ పరిష్కారాలను కూడా చూపించారు. ఉదాహరకు నీటి సరఫరాకు స్మార్ట్‌ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుద్ధ్యం కోసం చెత్త నుంచి విద్యుత్‌ తయారీ, చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుద్ధి చేయటం వంటి స్మార్ట్‌ పరిష్కారాలను పేర్కొన్నారు. నిజానికి మార్గదర్శకాల్లో పేర్కొన్న ఈ స్మార్ట్‌ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
- యంవి ఆంజనేయులు

Monday 10 August 2015

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

గత 25 సంవత్సరాలుగా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించటానికి ఉపయోగపడింది లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు షేర్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ లాంటి త్వరగా లాభాలు సంపాదించుకోవటానికి అవకాశమున్న రంగాల్లోకి మాత్రమే వచ్చాయి. భారతదేశంలో సరుకులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలు చేసుకోవడం కంటే, తమ స్వదేశాల నుంచి నేరుగా సరుకులను దిగుమతి చేసుకొని తమ దేశాల్లో ఉపాధిని కాపాడుకోవడంపైనే విదేశీ కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు ప్రపంచమంతటా ఇవే విధానాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి దేశంలోకి రప్పించినా, శతసహస్త్ర కోటీశ్వరుల సంపదపై ఆంక్షలు పెట్టినా ప్రభుత్వానికి కావాల్సినన్ని పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి. అలాంటి చర్యలు తీసుకోకుండా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఫలితాలు రావు. విదేశీ పెట్టుబడి రావాలంటే స్వదేశంలో కార్మికవర్గాన్ని అణచివేయాలనే ఆలోచనే పరమ దుర్మార్గమైంది. బిజెపి ఈ దుర్మార్గానికి సిద్ధంగా ఉన్నది. మోడీ ఇప్పటికే 23 దేశాలు తిరిగి, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలా సహకరిస్తామని వారి ముందు మోకరిల్లి కోరారు. ఈ సంవత్సర కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వసంస్థల అమ్మకం-మొదటికే మోసం
మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ.43 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను ప్రయివేటువారికి అప్పగించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.69 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇన్సూరెన్స్‌ రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. రైల్వేలలోనూ, రక్షణరంగంలోనూ నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని ఒక విధాన నిర్ణయం చేస్తామని చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ రకంగా విదేశీ పెట్టుబడులకు లొంగిపోవడం ఎప్పుడూ జరగలేదు. అందుకే సెప్టెంబర్‌ 2 సమ్మెలో కార్మికవర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పష్టమైన వైఖరి తీసుకున్నది.
- ఎంఎ గఫూర్‌