భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?
రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్ పార్టనర్‌గా సింగపూర్ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల తంతు జరుగుతోంది. రాజధాని ముసుగులో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. అలాగే కృష్ణానదిలోని లంకలతోపాటు, గోల్ఫ్‌కోర్సు, విలాసవంతమైన విల్లాలు, క్లబ్బులు, హోటళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రజా రాజధాని కోసమే భూమిని సేకరించేటట్లయితే ఇవన్నీ ఎందుకనే ప్రశ్న ఉదయించకమానదు. విదేశీ కంపెనీల వ్యాపారం కోసం రైతుల భూములు త్యాగం చేయాలా? ఇదేనా రాజధాని నిర్మాణం?
2013లో ప్రజల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా సవరించడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. దీనికోసం అడ్డదారిలో ఆర్డినెన్సులూ జారీచేసింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. ప్రజల ప్రతిఘటనతో పార్లమెంటులో భూ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాల్సొచ్చింది. కొద్దికాలంలో చెల్లిపోయే ఈ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం జీవో 166ను తెచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు బలవంతంగా భూములను కాజేస్తోంది. ఇది నైతికంగా చెల్లదు. 2013 చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను సేకరించరాదు. రాజధానిలో ఉన్న భూముల్లో సంవత్సరం పొడుగునా కూరగా యలు, ఆకుకూరలు, పళ్లు పండుతాయి. చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా భూమి సేకరించరాదనే నిబంధన లున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలకు 70 శాతం, ప్రయివేటు ప్రయోజనాల కోసం 80 శాతం రైతుల ఆమోదం పొందా ల్సుంది. సామాజిక ప్రభావ అంచనా నివేదిక రూపొందించ కుండా భూములు సేకరించ రాదని చట్టం చెబుతోంది.
- సిహెచ్ బాబూరావు
No comments:
Post a Comment