Friday 22 May 2015

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి..

ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు. పైగా ''ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉండే సమైక్య, సమగ్ర సమాజాన్ని పారిశ్రామిక రంగం కోరుతున్నది అని, అభివృద్ధిని, ఆర్థిక పెరుగుదలను, పోటీతత్వాన్నీ పెంచుకునే సమాజంగా ఉండాలి'' అన్న వాదనను ముందుకు తెచ్చింది. అంటే సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన ్లను నిరాకరిస్తోంది. ఇంతటితో ఆగకుండా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించ వచ్చునని చెప్పింది. స్వాతంత్య్రం అనంతరం ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ విద్యావకాశాలకు దూరమైన ఎస్టీ, ఎస్సీలకు ప్రైవేటు రంగం చేసిన సేవలు అత్యల్పం. మన సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ప్రాథమిక హక్కులు లేవు. దీనిని ఈ పత్రం కావాలనే విస్మరించింది. ఇలాంటి పరిస్థితిలో అణగారిన తరగతులకు విద్యావకాశాలు లభించగల వనడం భ్రమే అవుతుంది. నిజానికి ప్రాథమిక విద్య సైతం ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్షగా మిగిలింది. 
పెనుమల్లి మధు

Tuesday 12 May 2015

ఆత్మహత్యల భారతం..


నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360 అయింది. 2013తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైతు ఆత్మహత్యల ఈ మృత్యు ఊరేగింపు నిజానికి భయంకరమైన వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ధారావాహికగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలెన్ని కురిపించినా ఈ కీలకమైన రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. కానీ వ్యవసాయంతోనే జనాభాలో 60 శాతం మంది జీవితం ముడిబడి ఉంది. రైతులను రెండు రాజకీయ ఉద్దేశాల కోసమే వాడుకోవటం జరుగుతోంది. అవి రెండు బ్యాంకులు. ఒకటి ఓటు బ్యాంకు, రెండోది భూమి బ్యాంకు. నేడు ఇక కేవలం విదర్భ లేక మహారాష్ట్రలోనే కాదు, మహమ్మారిలా ఆత్మహత్యల సంఘటనలు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానాలకు వ్యాపించాయి. 2014 ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ ఆత్మహత్యల సంఖ్య 4,004. 1,347 మందితో తెలంగాణ రెండోదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 2011లో ఆత్మహత్యలు సున్నా, 2012లో నలుగురు, 2013లో మరలా సున్నా. గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 755కు పెరిగిపోయింది.