సిఆర్‌డిఏ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత రాజధాని ప్రాంత రైతుల్లో చంద్రబాబు సర్కార్ పై సందేహాలు,భయాలు మరింత పెరిగాయి. రైతులకిచ్చే పరిహారంపై బిల్లులో
చేర్చకపోవడం, భూమి అభివృద్ధి పనులకయ్యే ఖర్చును రైతులే భరించాలనడం, పరిహారం
పెంచినట్టు చెబుతున్న ప్రభుత్వం పరిహారం ఏడాది లోగా రైతులకు అందించాల్సి
ఉండగా దీనిని మూడేళ్లకు పొడిగించడం, పరిహారానికి చట్టబద్ధత లేకపోవడం..
తదితర అంశాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.గతంలో అభివృద్ధి కోసం ఎకరాకు రూ. 75 లక్షల నుంచి రూ. కోటి వరకూ
ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు
ప్రకటించారు. తీరా ఇప్పుడు ఆ ఖర్చు రైతులే భరించాలని సిఆర్‌డిఏ బిల్లులో
పేర్కొనడం చర్చనీయాంశమైంది. గడువు మూడేళ్లకు పెంచడంతో.. 'అప్పటి పరిస్థితెలా ఉంటుందో.. ఈలోగా ఎన్ని
మార్పులు సంభవిస్తాయో... ఈ గడువునూ పొడిగించరని గ్యారంటీ ఏమిటి? వ్యవసాయం
మానుకుని అఫిడవిట్లు ప్రభుత్వానికి ఇచ్చిన తరువాత ఏదో అంశంపై ఎవరైనా
కోర్టుకెళ్లి ప్రక్రియను నిలుపుదల చేస్తే మా పరిస్థితి ఏమిటి' అని సానుకూల
రైతులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజధాని ప్రాంత అభివృద్ధి
సంస్థకు విస్తృత అధికారాలు కల్పించడం, నిబంధనల ఉల్లంఘనపై సిఆర్‌డిఏ
కమిషనర్ ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్టు చేయాలన్న నిర్ణయమూ తీవ్ర
వివాదాస్పదంగా మారింది. పోలీసు కమిషనర్, ఎస్‌పిలూ కమిషనర్ పరిధిలోనే
పనిచేయాలని నిర్ధేశించడం ద్వారా విస్తృత అధికారాలు కల్పించినట్లయింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న సందేహాలను ఎవరు నివృత్తి
చేస్తారన్న అంశంపై తెలుగుదేశం వర్గాల్లోనూ కొంత అయోమయం నెలకొంది.
No comments:
Post a Comment