హుదుద్ తుపానుకు దెబ్బతిన్న రాష్ట్రానికి కేంద్రం అరకొర సాయం ప్రకటించడంపై
ముఖ్యమంత్రి చంద్రబాబు అచితూచి మాట్లాడారు. రూ. 60-70 వేల కోట్ల నష్టం
జరిగిందని పదే పదే చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం అధికారులు
పూర్తి స్థాయి జాబితాను తయారు చేసి.. 24 వేల కోట్లు నష్టం జరిగిందని
కేంద్రానికి నివేదించారు. అయితే కేంద్రం రూ. 670 కోట్లు మాత్రమే సాయం
అందజేసేందుకు అంగీకరించినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. జరిగిన నష్టాన్ని
కళ్లారా చూసిన మోడీ విశాఖలోనే తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ప్రకటించారు.
పూర్తి స్థాయి నివేదిక అందాక మరింత సాయం చేస్తామనే సంకేతాలిచ్చారు. తీరా
సాయం ప్రకటించే సమయం వచ్చేసరికి గాలి తీసేశారు. ప్రకటించినది కూడా
ఇవ్వకుండా కోత పెట్టనున్నట్లు తెలిసింది. ఇదే విషయమై చంద్రబాబును
ప్రశ్నించడంతో సమాధానం చెప్పేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. 'హుదూద్‌తో
జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చింది' అని
చెప్పారు. 'రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చారు కదా! మొత్తంగా 670 కోట్లు
రూపాయలు ఇస్తారని పత్రికల్లో వచ్చింది' అని విలేకరులు అడగడంతో ఆయన
అస్పష్టంగా సమాధానమిచ్చారు. 'జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంది.
ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం కొంత ఇచ్చింది. మిగిలిన
నష్టాన్ని రాష్ట్రం భరిస్తుంది' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment