Tuesday, 1 September 2015

ఉద్యమ విజయం..

భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన వివాదాస్పద సవరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించుకోవడం రైతుల ప్రతిఘటనకు విజయం. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా, పార్లమెంట్‌ ప్రక్రియను కాదని అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) జారీ చేసి, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చనుకున్న బిజెపి సర్కారు కుటిల పన్నాగం బెడిసికొట్టింది. సోమవారంతో కాలం తీరిపోతుందన్న ఆర్డినెన్స్‌ స్థానంలో మరో ఆర్డినెన్స్‌ జారీ చేయబోమని ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించిన 'మన్‌కీ బాత్‌'లో ప్రధాని చేసిన ప్రకటన సాదాసీదాగా రాలేదు. రైతుల నుంచి మిన్నంటుతున్న నిరసనలు, ప్రతిపక్షాల ఐక్య ప్రతిఘటనల ఉక్కిరిబిక్కిరికి తాళలేకనే చివరి నిమిషంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేటు పెట్టుబడులకు భూసేకరణ చట్టం ప్రతిబంధకంగా ఉందంటూ కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కార్పొరేట్లకై ఆర్రులు చాస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వంటివి సైతం భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలనడంతో మోడీ సర్కారు దూసుకెళ్లింది. రాజ్యసభలో ఎన్‌డిఎకు మెజార్టీ లేదని తెలిసినా ఎనిమిది మాసాల్లో మూడుసార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేసి పార్లమెంట్‌ ప్రతిష్టను మంటగలిపింది. సభ సమావేశం కాని రోజుల్లో ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు జారీ చేస్తాయి. ఆరునెలల్లోపు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందితేనే అవి చట్టాలవుతాయి. లేకపోతే కాలం చెల్లిపోతాయి. ఈ చిన్న విషయం 'వికాస పురుషుడి'కి తెలియకేంకాదు. నయానో భయానో మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను లోబర్చుకొని గట్టెక్కవచ్చనే ఆలోచనతోనే మోడీ సర్కారు ఒకసారి కాదు మూడుసార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ మెజార్టీ లేని రాజ్యసభలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాలతోపాటు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకించడంతో చేసేదిలేక సవరణలకు మోడీ 'రాంరాం' చెప్పారు. అసలు వాస్తవం ఇది తప్ప రైతులపై ప్రేమ ఉండి కాదు. 

Friday, 28 August 2015

భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?

రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు. డెవలప్‌మెంట్‌ పార్టనర్‌గా సింగపూర్‌ ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల తంతు జరుగుతోంది. రాజధాని ముసుగులో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. అలాగే కృష్ణానదిలోని లంకలతోపాటు, గోల్ఫ్‌కోర్సు, విలాసవంతమైన విల్లాలు, క్లబ్బులు, హోటళ్లు నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రజా రాజధాని కోసమే భూమిని సేకరించేటట్లయితే ఇవన్నీ ఎందుకనే ప్రశ్న ఉదయించకమానదు. విదేశీ కంపెనీల వ్యాపారం కోసం రైతుల భూములు త్యాగం చేయాలా? ఇదేనా రాజధాని నిర్మాణం?
2013లో ప్రజల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా సవరించడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. దీనికోసం అడ్డదారిలో ఆర్డినెన్సులూ జారీచేసింది. పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. ప్రజల ప్రతిఘటనతో పార్లమెంటులో భూ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాల్సొచ్చింది. కొద్దికాలంలో చెల్లిపోయే ఈ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం జీవో 166ను తెచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు బలవంతంగా భూములను కాజేస్తోంది. ఇది నైతికంగా చెల్లదు. 2013 చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూములను సేకరించరాదు. రాజధానిలో ఉన్న భూముల్లో సంవత్సరం పొడుగునా కూరగా యలు, ఆకుకూరలు, పళ్లు పండుతాయి. చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా భూమి సేకరించరాదనే నిబంధన లున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలకు 70 శాతం, ప్రయివేటు ప్రయోజనాల కోసం 80 శాతం రైతుల ఆమోదం పొందా ల్సుంది. సామాజిక ప్రభావ అంచనా నివేదిక రూపొందించ కుండా భూములు సేకరించ రాదని చట్టం చెబుతోంది.
- సిహెచ్‌ బాబూరావు

Monday, 17 August 2015

స్మార్ట్‌ సిటీ: ప్రజాస్వామ్యం శూన్యం


అసలు స్మార్ట్‌ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని మార్గదర్శకాల ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్దిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అవి అవసరాలకు సరిపడా నీటిసరఫరా, నిరంతర విద్యుత్‌ సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం, ప్రజారవాణాతో సహా సమర్థవంతమైన రవాణా సదుపాయాలు, భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం, బలమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటలైజేషన్‌, సుపరిపాలన ముఖ్యంగా ఈ-గవర్నెన్స్‌- ప్రజల భాగస్వామ్యం, మంచి పర్యావరణం, పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ, విద్య, వైద్యం. వీటిని గమనిస్తే కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి. క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం. వీటిని అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్‌ పరిష్కారాలను కూడా చూపించారు. ఉదాహరకు నీటి సరఫరాకు స్మార్ట్‌ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుద్ధ్యం కోసం చెత్త నుంచి విద్యుత్‌ తయారీ, చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుద్ధి చేయటం వంటి స్మార్ట్‌ పరిష్కారాలను పేర్కొన్నారు. నిజానికి మార్గదర్శకాల్లో పేర్కొన్న ఈ స్మార్ట్‌ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
- యంవి ఆంజనేయులు

Monday, 10 August 2015

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

గత 25 సంవత్సరాలుగా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించటానికి ఉపయోగపడింది లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు షేర్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ లాంటి త్వరగా లాభాలు సంపాదించుకోవటానికి అవకాశమున్న రంగాల్లోకి మాత్రమే వచ్చాయి. భారతదేశంలో సరుకులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలు చేసుకోవడం కంటే, తమ స్వదేశాల నుంచి నేరుగా సరుకులను దిగుమతి చేసుకొని తమ దేశాల్లో ఉపాధిని కాపాడుకోవడంపైనే విదేశీ కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు ప్రపంచమంతటా ఇవే విధానాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు, బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి దేశంలోకి రప్పించినా, శతసహస్త్ర కోటీశ్వరుల సంపదపై ఆంక్షలు పెట్టినా ప్రభుత్వానికి కావాల్సినన్ని పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి. అలాంటి చర్యలు తీసుకోకుండా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఫలితాలు రావు. విదేశీ పెట్టుబడి రావాలంటే స్వదేశంలో కార్మికవర్గాన్ని అణచివేయాలనే ఆలోచనే పరమ దుర్మార్గమైంది. బిజెపి ఈ దుర్మార్గానికి సిద్ధంగా ఉన్నది. మోడీ ఇప్పటికే 23 దేశాలు తిరిగి, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలా సహకరిస్తామని వారి ముందు మోకరిల్లి కోరారు. ఈ సంవత్సర కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వసంస్థల అమ్మకం-మొదటికే మోసం
మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ.43 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను ప్రయివేటువారికి అప్పగించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.69 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇన్సూరెన్స్‌ రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. రైల్వేలలోనూ, రక్షణరంగంలోనూ నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని ఒక విధాన నిర్ణయం చేస్తామని చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ రకంగా విదేశీ పెట్టుబడులకు లొంగిపోవడం ఎప్పుడూ జరగలేదు. అందుకే సెప్టెంబర్‌ 2 సమ్మెలో కార్మికవర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పష్టమైన వైఖరి తీసుకున్నది.
- ఎంఎ గఫూర్‌

Saturday, 25 July 2015

ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..

కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు జీత, బత్యాలు పెంచి ఖాజానాపై కోట్ల రూపాయల భారం వేశాడు. మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ, స్వదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
             రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాజధాని నిర్మాణం, 13 జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్లు లాంటి అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేర్చడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారు. కొత్తగా నిర్మించబోయే రాజధాని నగరం చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరిపై దాదాపు రూ.1,000 కోట్ల పన్నుల భారాన్ని వేయడానికి పథకం తయారు చేసినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన మమకారంతో కాబోలు ఆయన కేంద్ర ప్రభుత్వంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారు.
             గత సంవత్సరం సకాలంలో తగినంత వర్షాలు కురవక పోవడంతో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాలు సకాలంలో రద్దు కానందున రైతులకు బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వలేదు. ప్రకృతి నిరాదరణ, ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం వల్ల పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతిని చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు వేస్తున్నది. గత నాలుగు నెలల క్రితం దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.4ల పన్ను (వ్యాట్‌) పెంచాడు. వ్యవసాయానికి డీజిల్‌ ఇంజన్లను ఉపయోగించే రైతులు, ప్రజలను గమ్యానికి చేర్చే వాహనదారులపై పెను భారం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీజిల్‌పై పన్నులు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.

Friday, 24 July 2015

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన అంశాలేమైనా పరిష్కారం నోచుకున్నది లేదు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల వాగ్ధోరణులు శ్రుతి మించి చివరకు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి చేరాయి. ప్రాజెక్టుల నుంచి శాంతిభద్రతల వరకూ ప్రతిదీ ఎడతెగని ఘర్షణ వాతావరణానికే దారి తీశాయి. మొదటి ఏడాది పూర్తి చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎంతమాత్రం మేలు చేయని అవాంఛనీయ పరిస్థితి ఇది. మొత్తంపైన తెలుగు ప్రజలు సుహృద్భావం నిలబెట్టుకున్నా పాలకులు, పాలక పక్షాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెచ్చగొట్టడమే ధ్యేయంగా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం.
తెలకపల్లి రవి

Wednesday, 8 July 2015

ఆర్థిక అసమానతలు

ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. 
               ఐఎమ్‌ఎఫ్‌ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్‌మార్కెట్‌ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు అభివృద్ధి రేటును నిలువరించడానికి గల కారణాల్లో తీసివేయలేనివని తెలియజేసింది. ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఆర్థికవేత్త బ్లాంచన్‌ ''మనం ఇప్పుడు క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి దశలో నడుస్తున్నాం'' అని అన్నారు. 2016లో 3.8 శాతం వృద్ధితో మరలా ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మందకొండి అభివృద్ధి, పేరుకుపోతున్న రుణాల కారణంగా నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నదని అంచనావేసింది. యూరప్‌లో గడచిన అయిదు సంవత్సరాల్లో మూడవ మాంద్యం త్రుటిలో తప్పినట్లు తన నివేదికలో పేర్కొంది. అభివృద్ధిచెందుతున్న దేశాల వృద్ధిరేటు ఏప్రిల్‌లో 2.4 శాతం ఉంటుందని చెప్పగా ప్రస్తుతం ఈ సంవత్సరానికి తాజాగా 2.1 శాతం ఉంటుందని తేల్చింది. అభివృద్ధిచెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లలో అంచనాల కంటే తక్కువ ఉంటుందని తెలియజేస్తోంది. అమెరికాలో ఏప్రిల్‌ 2015లో 3.1 శాతం అంచనా వేయగా, ఇప్పుడు 2.5 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అంటుంది. 

Saturday, 27 June 2015

చాప కింద నీరులా నియంతృత్వం..


పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
బడా పెట్టుబడి రాజకీయ వ్యవస్థను ఆక్రమించింది. బడా పెట్టుబడి అందించే డబ్బు సంచులకు బూర్జువా రాజకీయ పార్టీలన్నీ దాసోహమంటున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తున్నది. పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాద మార్కెట్‌ మౌఢ్యం, హిందూత్వల ఈ కలబోత నియంతృత్వాన్ని ప్రమాదకరంగా వండివార్చేవిగా ఉన్నాయి. ఒకవైపు శ్రామిక చట్టాలను మార్చి కార్మిక సంఘాలను బలహీనపరుస్తూ, మరోవైపు భూ సేకరణ చట్టంలో తెస్తున్న మార్పులవలె పార్లమెంటు ప్రమేయంలేకుండా ఆర్డినెన్స్‌లను జారీచేస్తూ ప్రభుత్వం మార్కెట్‌ అనుకూల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. బిజెపికి స్వంతంత్రంగా మెజారిటీ ఉండటంతో పార్లమెంటును మోడీ ప్రభుత్వం చులకన భావంతో చూస్తున్నది. అది రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. నయా ఉదారవాదంలో ప్రజాస్వామ్యం పరిమితమవటానికి, ప్రజలెన్నుకున్న సంస్థల పరిధిలో నుంచి ప్రధాన నిర్ణయాధికారాలను లాక్కునేందుకు నడుస్తున్న ప్రక్రియలో ఆర్డినెన్స్‌ల వెల్లువ, రాజ్యసభను కించపరిచే ప్రయత్నం, ప్రధాని చేతుల్లో అన్ని అధికారాలూ కేంద్రీకృతమవ్వటం వంటి విషయాలు భాగమే. కాబట్టి, ఒక నియంతృత్వ క్రమం చాపకింద నీరులా చేరుకునే పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. నయా ఉదార వాదం, హిందూత్వ మతతత్వం, నియంతృత్వం-ఈ మూడింటి పైనా బహుముఖ పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ మౌలికంగా జతయివున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నాటి అత్యవసర పరిస్థితి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ వర్తమాన పోరాటంలో మనకు ఉపయోగపడతాయి.
- ప్రకాశ్‌ కరత్‌

Friday, 19 June 2015

బడి నవ్వుతోంది..!

కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్‌ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించాల్సిన 25 శాతం సీట్లను కేటాయించి వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లించేలా ప్రొసీజర్లు ఖరారు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుంది.
               బడి గంటలు గణగణమన్నాయి. అంతటా విద్యా కోలాహలం ప్రారంభమైంది. కానీ.. వాటి చుట్టూ ముసురుకున్న సమస్యలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమం తీరుతెన్నులు చూసి బడి పగలబడి నవ్వుతోంది. ఇంకా అనేకచోట్ల శిథిల పాఠశాలలు, ఫర్నీచర్‌లేని తరగతి గదులు, పైకప్పుల్లేని మరుగుదొడ్లు, గోడలు పడిపోయిన మూత్రశాలలు, తాగునీటి కొరత, భర్తీకాని ఉపాధ్యాయుల ఖాళీలు, పుస్తకాలందని పిల్లలను చూస్తుంటే 'బడి పిలుస్తోందా!' లేక ఈ దుస్థితి చూసి 'బడి నవ్వుతోందా!' అని సందేహం కలగక మానదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకూ 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇటీవలనే ముఖ్యమంత్రి దానిపై విద్య, వైద్య, మున్సిపల్‌, తదితర శాఖల మంత్రులను కూర్చోబెట్టుకొని సమీక్ష చేసి 15 నుంచి బ్రహ్మాండంగా పాఠశాలలను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. ఇంకా పాఠశాలల్లో పదివేల పోస్టులను భర్తీ చేయవలసే ఉంది. డిఎస్‌సి సెలక్షన్స్‌ అయ్యాయి. నియామకాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డొచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎదురవుతుందని నాలుగు నెలల ముందటే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్ల నియామకాలు జరగక ముందే పాఠశాలలు మొదలయ్యాయి. అప్పటికే ప్రయివేటు విద్యాసంస్థలు ఇల్లిల్లూ తిరిగి పిల్లల్ని చేర్పించుకున్నాయి. ఆ తరువాత 'బడి పిలుస్తోంది' అంటే ఎవరొస్తారు?
- వి కృష్ణయ్య

Friday, 22 May 2015

ప్రైవేటురంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి..

ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు. పైగా ''ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉండే సమైక్య, సమగ్ర సమాజాన్ని పారిశ్రామిక రంగం కోరుతున్నది అని, అభివృద్ధిని, ఆర్థిక పెరుగుదలను, పోటీతత్వాన్నీ పెంచుకునే సమాజంగా ఉండాలి'' అన్న వాదనను ముందుకు తెచ్చింది. అంటే సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన ్లను నిరాకరిస్తోంది. ఇంతటితో ఆగకుండా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించ వచ్చునని చెప్పింది. స్వాతంత్య్రం అనంతరం ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ విద్యావకాశాలకు దూరమైన ఎస్టీ, ఎస్సీలకు ప్రైవేటు రంగం చేసిన సేవలు అత్యల్పం. మన సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ప్రాథమిక హక్కులు లేవు. దీనిని ఈ పత్రం కావాలనే విస్మరించింది. ఇలాంటి పరిస్థితిలో అణగారిన తరగతులకు విద్యావకాశాలు లభించగల వనడం భ్రమే అవుతుంది. నిజానికి ప్రాథమిక విద్య సైతం ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్షగా మిగిలింది. 
పెనుమల్లి మధు

Tuesday, 12 May 2015

ఆత్మహత్యల భారతం..


నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360 అయింది. 2013తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైతు ఆత్మహత్యల ఈ మృత్యు ఊరేగింపు నిజానికి భయంకరమైన వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ధారావాహికగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలెన్ని కురిపించినా ఈ కీలకమైన రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. కానీ వ్యవసాయంతోనే జనాభాలో 60 శాతం మంది జీవితం ముడిబడి ఉంది. రైతులను రెండు రాజకీయ ఉద్దేశాల కోసమే వాడుకోవటం జరుగుతోంది. అవి రెండు బ్యాంకులు. ఒకటి ఓటు బ్యాంకు, రెండోది భూమి బ్యాంకు. నేడు ఇక కేవలం విదర్భ లేక మహారాష్ట్రలోనే కాదు, మహమ్మారిలా ఆత్మహత్యల సంఘటనలు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానాలకు వ్యాపించాయి. 2014 ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ ఆత్మహత్యల సంఖ్య 4,004. 1,347 మందితో తెలంగాణ రెండోదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 2011లో ఆత్మహత్యలు సున్నా, 2012లో నలుగురు, 2013లో మరలా సున్నా. గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 755కు పెరిగిపోయింది.

Tuesday, 17 February 2015

మోడీ,ఆర్.ఎస్.ఎస్ ల జాయింట్ వెంచర్ ..!

కేంద్రం లో మోడీ ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్ కనుసన్నల్లో నడుస్తోంది.కేంద్ర ప్రభుత్వం,ఆర్.ఎస్.ఎస్ ల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్.ఎస్.ఎస్ నాయకత్వం వ్యవస్థీకృతం అయ్యింది. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెని.ఇందులో ప్రధాన వాటాలు ఆర్.ఎస్.ఎస్ వే.ఇలాంటి పరిస్తితుల్లో మోడీ అనుసరిస్తున్న సంక్షేమ వ్యతిరేక ఆర్ధికవిధానాలకు,ఆర్.ఎస్.ఎస్ మతోన్మాద భావజాలానికి వ్యతిరకంగా పోరు కొనసాగించాల్సిన అవసరం వుంది.

భూస్వామ్య,పెత్తందారీ అహంకారానికి నిదర్శనం..

రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద ప్రజానీకాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి, బాధ్యతారాహిత్యానికే కాకుండా రాష్ట్రంలో పాలక పార్టీ విధానాలకు కూడా అద్దంపడుతున్నాయి. ఎన్నికల ముందు ఎవరికైతే ఆపద మొక్కులు మొక్కారో, కాళ్లావేళ్లా పడి.. బాబ్బాబు అంటూ బతిమలాడారో, ఎన్నికలైన తరువాత వారినుద్దేశించే బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. సుఖాల కోసమే పేదలు వలసలు పోతున్నారంటూ చూపిన వాచాలత ఫక్తు భూస్వామ్య భావజాలానికి, పెత్తందారీతనపు అహంకారానికి నిదర్శనం. చుక్కలు దాటి దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో రెండు పూటల తిండికి హామీ ఇచ్చే రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోవే! ఆ పథకం దారి తప్పుతోందంటే జెసి వంటి పాలకుల అవినీతి, ఆశ్రితపక్షపాతాలే కారణం తప్ప బతుకు బండిని ఈడ్చడానికి నానా కష్టాలుపడే పేద ప్రజలు కాదు.గతంలో టిడిపికే చెందిన మరో ఎంపి గల్లా జయదేవ్‌ ఇదే విధంగా నోరుపారేసుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలకు దిగడం, పేదలకిచ్చే సబ్సిడీలను తొలగించాల్సిందేనంటూ ప్రపంచ బ్యాంకు చేస్తున్న హుకుంల నేపథ్యంలో ఆ తానులో ముక్కలుగా మారిన నేతలే ఇటువంటి మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాలు, స్వార్థ ప్రయోజనాలు, సొంత కుటుంబ ఆస్తుల పెంపే అజెండాగా రాజకీయాలు చేస్తున్న ఈ తరహా నాయకులకు పేదల కష్టాలు అర్థమవుతాయని, వారి కన్నీళ్లను తుడిచి, బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తారని ఆశించడం అత్యాశే!

Friday, 13 February 2015

దామాషా ఎన్నిక .. ఎస్.వెంకట్రావ్

ప్రస్తుత ఎన్నికల విధానం మన దేశంలో ఎన్నికలను వ్యాపారంగా మార్చేసింది.ప్రధాన పార్టీ అభ్యర్ధులకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనుక ఎన్నికల్లో సీట్లు సంపాదించడానికి అభ్యర్ధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో బాగా ఖర్చు చేయగలిగిన వారికే సీట్లు ఇస్తున్నాయి.పోటీ చేసే అభ్యర్ధులు కూడా గెలుపు కోసం ఓట్లను డబ్బిచ్చి కొనేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.దామాషా ఎన్నికల(ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్)విధానంలో అయితే ఒక పార్టీకి దేశం మొత్తం మీద,లేక ఒక ప్రాంతంలో ఎంత శాతం ఓట్లు వస్తే చట్టసభల్లో దానికి అంత శాతం ప్రాధాన్యత లభిస్తుంది. అంటే ఓట్ల శాతాన్ని బట్టి అభ్యర్ధుల శాతం ఉంటుందన్నమాట.దీని వాల్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష చాల వరకు చట్ట సభల్లో ప్రతిబింబిస్తుంది.చిన్నచిన్న సామజిక తరగతులకు కూడా తగిన ప్రాధాన్యత లభించే అవకాశం వుంటుంది. అయితే దామాషా ఎన్నికల విధానం కూడా పూర్తి ప్రజాస్వామికం అనుకోకూడదు.ఇవన్నికూడా బూర్జువ ప్రజాస్వామ్యం లో కొన్ని ఎన్నికల వ్యవస్థలు.ప్రజాస్వామ్యం ఒక్క సోషలిస్ట్ వ్యవస్థలోనే పూర్తిగా ప్రజ్వరిల్లుతుంది.ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో పరిమితులను అధిగమించేందుకు,మెరుగైన వ్యవస్థలు రూపొందించుకునేందుకూ కేవలం పోరాడడం ద్వారానే మనం జనతా ప్రజాస్వామ్యం లోకి వెళ్ళగలం.

Thursday, 12 February 2015

ఇదే నిజమైన ఐక్యత .. సి.పి.ఐ(ఎం)

వామపక్ష ఐక్యత అంటే ఉమ్మడి వేదికల మీద ఉమ్మడి నినాదాల ప్రాతిపదికపై ఏర్పడే ఐక్యత,ఐక్య ఉద్యమాలు,చర్యల ఆధారంగా ఏర్పడే ఐక్యత. ఇది నెరవేరాలంటే వామపక్ష శక్తులు మరింత ఎక్కువ,లోతైన అవగాహన ఏర్పరుచుకోవాలి.ప్రజా ఉద్యమాల నిర్మాణంలో వామపక్షాల మధ్య మరింత సమన్వయo అవసరం.మతోన్మాద శక్తులకు,మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలపక్షాన నిలిచి వారి ప్రయోజనాలు కాపాడే శక్తి ఒక్క వామపక్షాలకు మాత్రమే వుంది.కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలు,గ్రూపులు లౌకికతత్వంపై కేవలం మాటలకే పరిమితం అయ్యాయి.కేవలం వామపక్షాలు మాత్రమే లౌకికతత్వానికి కట్టుబడుతున్నాయనడంలో సందేహంలేదు.

ఆర్ధిక సంక్షోభాలకు మూలకారణం ..

శ్రామికుని శ్రమను దోచుకునే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వున్నంతకాలం పెట్టుబడికి,శ్రమకు వైరుధ్యం వుండి  తీరుతుంది.ఉత్పత్తికి,వినిమయానికి వైరుధ్యం వుంటుంది.సరుకు విలువకూ కొనుగోలు శక్తికి తగాదా నడుస్తూనే వుంటుంది. ఈ వైరుధ్యంలోంచే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్ధిక సంక్షోభాలు తలెత్తుతూ వుంటాయి. నిరంతరం పెరిగే సరుకుల ఉత్పత్తుల విలువకు తగినట్లుగా వాటిని కొనుగోలుచేసే ప్రజల ఆర్ధిక శక్తి పెరగకపోవడమే సంక్షోభాలకు మూలకారణం.ఆ కోనుగోలు శక్తిని ప్రజలకు పెంచేవిధంగా పాలించడం,అందుకు అవసరమైన ఆర్ధిక విధానాలను అనుసరించడమే ఆర్ధిక సంక్షోభాలకు పరిష్కారమార్గం.

కాషాయ పాఠాలు..!

సమాజ మార్పుకు అత్యంత కీలకమైన విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడం పైనే బిజెపి,హిందూత్వ శక్తుల కేంద్రీకరణ. బిజెపికి స్వంత మెజార్టీతో వుండడంతో విద్యపై కవ్వింపు చర్యలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరివార్‌ ప్రతినిధులు తలా ఓ ప్రతిపాదన చేస్తున్నారు.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి స్మృతి ఇరానీ తరచుగా మోడీ ఆశలకు అనుగుణంగా విద్యావిధానం మారాలని చెబుతున్నారు.రామాయణం, మహాభారతాన్ని పాఠ్యాంశాలుగా చేర్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఆర్‌ దబే చెప్పారు. భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. వేదకాలంలోనే వెల్లివిరిసిన సైన్స్‌, గణితాలను పాఠ్యాంశాలుగా బోధించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతవేత్త దీనానాథ్‌ బాత్రా సూచించారు. ఆయన రాసిన పుస్తకాలను గుజరాత్‌లోని పాఠశాలల్లో బోధిస్తున్నారు.విద్యా విధానాన్నే మార్చే పేరుతో చరిత్రను వక్రీకరించటం వంటివి హిందూత్వ ఎజెండాలో భాగాలే.ఒక మతానికి చెందిన సిద్ధాంతాలు, విశ్వాసాలు పాఠ్యాంశాలు అయితే అన్నిమతాలు, కులాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో విద్యను అభ్యసించే కామన్‌ స్కూల్‌ విధానం చెదిరిపోతుంది. బాల్యదశలోనే మత ప్రాతిపదికన చీలికలు ఏర్పడతాయి.మత సామరస్యం మంటగలుస్తుoది.బిజెపి అధికారంలో ఉన్నంత కాలం విద్యారంగంలో ఇలాంటి కాషాయ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. 

Tuesday, 10 February 2015

అణుప్రమాదం..!

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటనతో బిగిసిన అణు బంధం పెను ముప్పునకు దారితీయనుంది. పౌర అణుసహకార ఒప్పందంలోని అడ్డంకులు తొలగిపోయాయని ఇరు దేశాల నేతలూ ప్రకటించడంతో బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు తలుపులు బార్లా తెరిచినట్లయింది. ప్రమాదభరితమైన అమెరికా కంపెనీల అణు రియాక్టర్లను కొనుక్కుంటే ఎలాంటి భరోసా, బాధ్యత ఆ కంపెనీలకు ఉండనవసరం లేదని మోడీ ప్రభుత్వం లొంగుబాటు వైఖరి ప్రదర్శించింది.తొలి దశలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు పార్కు ప్రాజెక్టు ఒకటి. ప్రమాదవశాత్తు అణువిస్ఫోటనం జరిగితే ఉత్తరాంధ్ర ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అణు ఇంధన, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియాక్టర్లు ప్రమాదానికి గురైతే నివారణ చర్యలు, పరిహారం చెల్లింపు బాధ్యతలను ఆయా కంపెనీలు తీసుకోవు.వాటి గ్యారంటీ, వారంటీల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మోయడానికి అంగీకరించింది. 2013 భూ సేకరణ చట్టం ఉన్నంతలో ప్రజలకు మేలు చేసేదిగా ఉండేది.గతేడాది డిసెంబరు చివరిలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడం, రాష్ట్రపతి ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి.ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇక ముందు గ్రామసభల నిర్వహణ, ప్రజాభిప్రాయ సేకరణ ఉండదు. పాత చట్టం ప్రకారం 80 శాతం ప్రజల ఆమోదం ఉండాలి. సామాజిక ప్రభావ మదింపు నివేదిక కూడా ఉండాలి. ప్రస్తుత ఆర్డినెన్స్‌తో ఆ చట్టబద్ధ హక్కులు హరించబడ్డాయి. రైతులకు, భూ యజమానులకు మాత్రమే పరిహారం అందుతుంది. భూమిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు, వృత్తులతో జీవనం సాగిస్తున్న వారికి, మొత్తం గ్రామీణ జీవనంలో మమేకమైన వారికి ఎలాంటి పరిహారం, భద్రత ఉండదని ఆర్డినెన్స్‌ చెబుతోంది.

ఆకలి,దారిద్య్రంలో ఆఫ్రికాను మించిన భారతదేశం..

నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాలలో భారత్‌ ఒకటని నిరంతరం గుర్తు చేస్తుంటారు.అయితే ప్రపంచంలోనే అత్యంత నిరుపేదలు నివసించే ప్రాంతంగా భావిస్తున్నఆఫ్రికాను కూడా మించి భారతదేశంలోని దారిద్య్రం, ఆకలి ఉన్నదనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. దేశంలోని దారిద్య్రం అధికారికంగా వర్గీకరించిన 'అతి తక్కువ అభివృద్ధిచెందిన దేశాలను' మించిపోయింది.ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవటం, దాంతో మార్కెట్‌లో ఎక్కువ ధరలకు కోనుగోలు చేయవలసిరావటం వల్లనే ప్రజల ఆహార వినియోగం తగ్గిందని తెలుసుకోవాలి.ఆహార ధాన్యాల వినియోగం తగ్గితే ఆకలి పెరుగుతుంది. ఇలా పెరుగుతున్న ఆకలి దారిద్య్రం తీవ్రతకు సంకేతం. విద్య, ఆరోగ్య సేవలను ప్రయివేటీకరించటమే దీనికి కారణం.

సమగ్రాభివృద్దే మా నినాదం ..సిపిఐ(ఎం)

కమ్యూనిస్టు శక్తులకు పెట్టనికోటగా సుదీర్ఘ కాలంపాటు నిలిచిన బెజవాడలో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాష్ట్ర మహాసభలో ప్రస్తుత పరిస్థితికి తగిన నినాదాన్ని చేపట్టింది.వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న సిపిఐ(ఎం) ఇప్పటికే వివిధ ప్రజాసమస్యలపై మరో తొమ్మిది వామపక్ష పార్టీలతో కలిసి కార్యాచరణ సాగిస్తోంది.ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతకు నికరంగా కట్టుబడిన ఏకైక పార్టీ సిపిఐ(ఎం).రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశంవంటి వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలనీ, మిగిలిన జిల్లాల్లోని వెనుకబడిన మండలాల అభివృద్ధికి కృషి చేయాలనీ మహాసభ మొట్టమొదటి తీర్మానంలోనే కోరడం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి నమూనాతో మరింత కేంద్రీకరణ పెరిగి భవిష్యత్తులో ఏర్పాటువాద ఉద్యమాలకు అవకాశం ఏర్పడుతుందని హెచ్చరించడం సరైనదే. 

ఆరుసార్లు ఆతిధ్యం..

సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు విజయవాడ నగరం ఆరుసార్లు ఆతిధ్యమిచ్చింది.1938లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ రాష్ట్ర మహాసభ జరగ్గా.. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1943లో కూడా తృతీయ రాష్ట్ర మహాసభ విజయవాడలోనే జరిగింది. చండ్ర రాజేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సిపిఐ(ఎం) ఆవిర్భావానంతరం 1964లో విజయవాడలో రాష్ట్ర మహాసభ జరిగింది. మోటూరు హనుమంతరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ రాష్ట్ర 14వ మహాసభ కూడా విజయవాడలోనే జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1988లో రాష్ట్ర 16వ మహాసభ జరగ్గా లావు బాలగంగాధరరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక య్యారు.తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలో పార్టీ రాష్ట్ర 24వ మహాసభ జరిగింది.రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు ఎన్నికయ్యారు.అలాగే పార్టీ జాతీయ మహాసభలు అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఒకసారి, సిపిఐ(ఎం) ఆవిర్భావానంతరం ఒకసారి జరిగాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ 6వ మహాసభలు 1961లో జరగ్గా, సిపిఐ(ఎం) 10వ మహాసభలు 1982లో జరిగాయి. 1961లో జరిగిన మహాసభ లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత కార్య దర్శిగా అజరుఘోష్‌, 1982లో జరిగిన సిపిఐ (ఎం) జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ఎన్నికయ్యారు. 2010 ఆగస్టులో పార్టీ అఖిల భారత ప్లీనం విజయవాడలోనే జరిగింది.

మేం కోరుకునే అభివృద్ధి వేరు.. పి.మధు

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అభివృద్ధి స్వభావం వేరు, మేం కోరుకుంటున్న అభివృద్ధి వేరు. మేం కోరుకునే అభివృద్ధి సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదిగా ఉంటుంది. ముఖ్యమంత్రి కోరుకుంటున్న అభివృద్ధిలో పెద్దపెద్ద రోడ్లూ, భారీ పర్యాటక కేంద్రాలూ, పెద్ద విమానాశ్రయాలూ ఉన్నాయి. ఇలాంటివి అవసరమే అయినా తక్షణం ప్రజల ఉపాధిని దెబ్బతీయకూడదు. జీవన ప్రమాణాలను పెంచేదిగా ఉండాలి. రాజధాని నిర్మాణం పేరుతో భూములు గుంజుకుంటే వాటి మీద జీవనం సాగిస్తున్న రైతులూ, కూలీలూ ఏం కావాలి?ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించకుండా వారి భూములు లాక్కోవడం సరైనది కాదన్నదే మా వైఖరి.

Monday, 9 February 2015

సి.పి.ఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ 24వ రాష్ట్ర మహాసభలు

13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, 59 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది.సి.పి.ఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు ఎన్నికయ్యారు.

కార్యదర్శివర్గ సభ్యులు :
పి.మధుతో పాటు పాటూరు రామయ్య, ఎస్‌.పుణ్యవతి, ఎం.ఏ,గఫూర్‌, వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు, డాక్టర్‌ మిడియం బాబూరావు, ఎం.వి.ఎస్‌.శర్మ, వి.ఉమామహేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, డి.సుబ్బారావు, సిహెచ్‌.బాబూరావు

రాష్ట్ర కమిటీ సభ్యులు :
బి.వి.రాఘవులు, వై.సిద్దయ్య, బి.తులసీదాస్‌, టి.రవి, ఎస్‌.వెంకట్రావు, మిరియం వెంకటేశ్వర్లు, కె.స్వరూపరాణి, డి.రమాదేవి, పి.జమలయ్య, పి.మురళీకృష్ణ, వంగల సుబ్బారావు, పి.రోజా, జుత్తిగ నర్సింహమూర్తి, జె.జయరాం, వి.వెంకటేశ్వర్లు, బి.కృష్ణమూర్తి, మంతెన సీతారాం, ఆర్‌.రఘు, జాలా అంజయ్య, సిహెచ్‌.రాజగోపాల్‌, కె.కుమార్‌రెడ్డి, బి.నారాయణ, జి.ఓబులు, కె.ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్‌,తమ్మినేని సూర్యనారాయణ, కె.లోకనాథం, బి.గంగారావు, కిల్లో సురేంద్ర, డి.శేషబాబ్జి, బి.బలరాం, చింతకాయల బాబూరావు, డి.వి.కృష్ణ, పాశం రామారావు, గద్దె చలమయ్య, పూనాటి ఆంజనేయులు, కె.మురళి, కె.ఆంజనేయులు, వి.రాంభూపాల్‌, ఎన్‌.రంగారావు, వెంకటేశ్వరరావు, పి.ప్రభాకర్‌, ఎ.మాల్యాద్రి, ఆర్‌.లక్ష్మయ్య, కె.ధనలక్ష్మి, సుబ్రహ్మణ్యం.23 మంది జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఎంపికయ్యారు.

ప్రత్యేక ఆహ్వానితులు :
జక్కా వెంకయ్య, సింహాద్రి శివారెడ్డి, ఆర్‌.సత్యనారాయణరాజు, సిహెచ్‌.తేజేశ్వరరావు

కంట్రోల్‌ కమిషన్‌ :
బి.ఆర్‌.తులసీరావు, వి.ఎస్‌.పద్మనాభరాజు, కె.హరికిషోర్‌

Thursday, 5 February 2015

పార్టీ బలోపేతమే లక్ష్యం.. సిపిఐ(ఎం)

లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నయా సరళీకరణ ఆర్థిక విధానాల అమలుతో పాటు హిందుత్వ సంస్థలు తమ మతతత్వపు అజెండాను దూకుడుగా ముందుకు తీసుకొస్తున్నాయి.వీటికి వ్యతిరేకంగా పోరాడటం,పార్టీ స్వతంత్ర శక్తిని పెంపొందించడం పార్టీ ప్రధాన లక్ష్యం. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సిపిఎం స్వతంత్ర పాత్రతో వామపక్ష ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బుర్జువాపార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయం కాగలదు. అన్ని వామపక్షాలను ఐక్యం చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది.


Tuesday, 3 February 2015

గిల్లి జోకొట్టే కుటిలత్వం..

వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ 'గిల్లడం, ఆ తర్వాత జోకొట్టడం' బిజెపి, ఇతర సంఘపరివార్‌ శ్రేణులకు పరిపాటిగా మారింది. 'హిందూ రాష్ట్ర', 'ఘర్‌ వాపసీ' 'లవ్‌ జిహాద్‌' వగైరాలతో గిల్లే పాత్రను ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ లాంటి పరివార్‌ సంస్థలు పోషిస్తూ ఉంటే, జోకొట్టే పాత్రను బిజెపి పోషిస్తోంది.సంఘపరివార్‌ శ్రేణులు చేపట్టిన 'ఘర్‌ వాపసి',మత మార్పిడులను నిషేధించాలన్న బిజెపి వాదాన్నీ ఇలాగే అర్థంచేసుకోవాలి. ఒకవైపు ఘర్‌ వాపసీ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. అందులో బిజెపి ఎంపిలు, నేతలు కూడా వుంటారు. అయినా సరే పార్టీ, ప్రభుత్వం వాటితో తమకు ఏమాత్రం సంబంధం లేనట్టు నటిస్తాయి. మత మార్పిడులపై చర్చ జరగాలన్న వాదాన్ని ముందుకు తెస్తాయి. పరివార్‌ శ్రేణులు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే అజెండాను ముందుకు తెస్తుంటే,అమిత్‌ షా మత మార్పిడుల వల్ల మీ ఇంటికి నీరు,విద్యుత్తు రాకుండా ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఇది బిజెపి పరోక్ష సమర్థనకూ అద్దంపడుతుంది. 

Saturday, 31 January 2015

బలిపీఠంఫై భారత్..?

రిపబ్లిక్‌ డే రోజున 'విశిష్ట అతిథి'గా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా మూడురోజులపాటు భారత్‌లో హల్‌చల్‌ చేశారు.అమెరికా తన 'దక్షిణ ఆసియా ఇరుసు'కు మేకుగా భారత్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నది. ప్రపంచ స్థాయిలో ప్రాబల్యంగల రాజ్యంగా అవతరించాలనే కాంక్ష భారతీయ పాలక వర్గాలను అమెరికా పెట్టుబడులపై ఆధారపడేలా చేస్తున్నది. దానికి అనుగుణంగానే ఒబామా-మోడీలు తాజాగా 10 సంవత్సరాల సైనిక సహకార ఒప్పందాన్ని కొనసాగించటానికి పరస్పర అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. భారత్‌-అమెరికా సంయుక్త రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం చొరవ(డిటిటిఐ)లో భాగంగా నాలుగు రక్షణ వ్యవస్థల ఉత్పత్తులు మొదలవుతాయని ఒబామా-మొడీ ప్రకటించారు. ఈ చొరవ ప్రధానోద్దేశం ఏమంటే భారత్‌ తన రక్షణావసరాలకై అమెరికాపై ఆధారపడేలా చేయటం. అంతేకాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతున్న భారత్‌-రష్యా స్నేహ బంధాన్ని నాశనం చేయటం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఆసియా-పసిఫిిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతం గురించి ఒబామా-మోడీ సంయుక్త ప్రకటనలో వెల్లడించిన అభిప్రాయం దక్షిణ చైనా సముద్రంలో తూర్పు ఆసియా దేశాలకు, చైనాకు మధ్య వివాదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నది. 2010లో భారత పార్లమెంటు చేసిన పౌర అణు నష్టపరిహారం బాధ్యత ఒప్పంద చట్టం అణు ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు పరిహారం చెల్లించే బాధ్యతను అణు రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీపై ఉంచింది. అయితే మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి బాధ్యతను భారత దేశ ప్రజలపైకి నెట్టింది. అంతిమంగా చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానానికి అనుబంధంగా భారత విదేశాంగ విధానాన్ని మార్చటానికి మోడీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. అంటే అమెరికా కాంక్షించే ఏక ధృవ ప్రపంచంపై ఆధిపత్యాన్ని చలాయించటానికి సహాయపడే వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశం మారబోతున్నది.

Friday, 30 January 2015

బిజెపి,టిడిపిల ప్రత్యేక దగా !

నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాకపోవచ్చంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం,ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో మీడియాకు లీకులివ్వడం రాష్ట్ర ప్రజలను మరోసారి దగా చేయడమే! బిజెపి రెండు నాల్కల ధోరణికిది నిదర్శనం కాగా ఆ పార్టీతో చంద్రబాబు లాలూచీ వ్యవహారానికి మరో దృష్టాంతం.కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారాని కొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయ ప్యాకేజీ వంటివి అమలు చేయించడం తేలికవుతుందని చెప్పి ఓట్లు పొంది ఇలా దగా చేయడం ఆ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య.

ప్రజా రాజధాని కాదు కార్పొరేట్ అడ్డా..బివి రాఘవులు

రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పూర్తిగా కార్పొరేట్‌ రాజధానిగానే నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది.కడుపులో నీళ్లు కదలకుండా విమానాల్లో, కోట్ల విలువైన కార్లలో తిరుగుతూ కాలం గడుపుతున్న వారి చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం తీసుకోవచ్చు. రాజధాని నిర్మాణంలో కీలకమైన కృష్ణానది కరకట్ట భాగంలో ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకూ ఉన్న పది గ్రామాలను పూర్తిగా పోలీసులతో నింపేసింది. పెద్దల చేతుల్లో కృష్ణానదికి ఆనుకుని ఉన్న భూములు, వాటిల్లో ఉన్న నిర్మాణాల జోలికెళ్లడం లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి బోటులో వెంకటపాలెం వరకూ వెళితే నదిని ఆక్రమించి, పూడ్చి నిర్మించిన లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు కనిపిస్తాయి. అందమైన, అధ్భుతమైన నిర్మాణాలు, వీటిల్లో ఏ ఒక్క భవనానికీ నదీ పరీవాహక పరిరక్షణ చట్టం నుంచి మినహాయిస్తున్నట్లు(ఎన్‌ఓసి) అనుమతులు లేవు. యథేచ్ఛగా నిర్మించేశారు. గతంలో అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. నిర్మించినవారిలో ఎక్కువమంది ఆయా పార్టీలకు చెందినవారే ఉన్నారు.కరకట్ట వెంబడి ఉన్న పొలాలన్నిటినీ  బిజెపి పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు(ఎంపి) గోకరాజు గంగరాజు స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్‌ భూములూ లీజు పేరుతో ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లేని నిర్మాణాలు 2.53 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే వాటిల్లో గంగరాజుకు చెందినవే 58 సెంట్లలో ఉన్నాయి. దీనిలో నదిని పూర్తిగా ఆక్రమించి హంగూ, ఆర్భాటాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన విడిది భవనమూ ఉంది.  రాజధాని భూ సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే తన పొలాలు, భవనాల మధ్యలో ఉన్న అరెకరం స్థలాన్ని శ్యాంప్రసాద్‌ ముఖర్టీ ట్రస్టుకు బిజెపి ఎంపి గంగరాజు రాసిచ్చినట్లు తెలిసింది. దీనిలో భవన నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్దిశాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల శంకుస్థాపన చేశారు. . తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు చెబుతున్న పారదర్శకత అనే పదానికి అర్థం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రజా రాజధాని అన్నమాటకు విలువ లేకుండా పోతుంది.పేదలన్నా, రైతులన్నా ఏ మాత్రమూ కనికరం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు కన్నబిడ్డల్లాంటి పొలాలను లాక్కుని కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం కట్టబెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.  

Sunday, 11 January 2015

మోడీ ప్రభుత్వ ఆరు నెలల పాలన..

క్లుప్తంగా చెప్పాలంటే.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ప్రమాదం కొనితెస్తోంది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసి విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారులకు లాభాలు తెచ్చే బిల్లులను ఆర్డినెన్స్‌ రూపంలో తెస్తోంది. ఒకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ తెచ్చేవారు. ఈ ఆరు నెలల్లో తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చారు.'' ఏదైనా బిల్లు ఆమోదించాలంటే పార్లమెంటులో చర్చకు పెట్టాలి. బిజెపి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇన్స్యూరెన్స్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి, కోల్‌మైనింగ్‌ను ప్రయివేటీకరించటానికి ఆర్డినెన్స్‌ తేవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అభ్యంతరం చెప్పారు. జాతి సమగ్రతను కాపాడే లౌకికత్వాన్ని తుంగలో తొక్కు తున్నారు. మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు, ప్రాంతాల మధ్య చీలికలు తెస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందే విధానాలను అనుస రిస్తున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ ఇంత ప్రచారం చేశాక పారిశ్రామికరంగం, ఉత్పత్తి రంగంలో గ్రోత్‌ రేటు -4.1 శాతానికి పడిపోయింది.ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు సగం తగ్గాయి. దాని ప్రకారం భారతదేశంలో లీటరు పెట్రోలు రూ.35కి, డీజిల్‌ రూ. 30కి రావాలి. కానీ అలా జరగలేదు. పెట్రోలు ధరలు తగ్గిన మూడు సార్లు ఎక్సైజ్‌ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. ఒక్కోసారి రూ.70 వేల కోట్లు చొప్పున మూడు సార్లు పెంచడంతో ప్రభుత్వానికి రూ. 2.10 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. కానీ ప్రజలమీద భారం మాత్రం అలాగే ఉంది.

సిపిఎం జాతీయ మహాసభల పైలాన్‌..

ఏప్రిల్‌ 14 నుంచి 19 తేదీల్లో విశాఖ నగరం లో జరగనున్న సిపిఎం 21వ అఖిల భారత మహా సభలకు సూచికగా విశాఖనగరంలోని డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద సుమారు 50 అడుగుల ఎత్తున ఏర్పాటైన పైలాన్‌పై ఒక వైపున మార్క్స్‌, ఏంగిల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, చేగువేరా ఫొటోలను ఏర్పాటు చేశారు. మరోవైపున సిపిఎం అగ్రనేతలు కీర్తిశేషులు ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతిబసు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎకె గోపాలన్‌, పి.రామ్మూర్తి, ప్రమోద్‌దాస్‌ గుప్తా, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, బిటి రణదేవ్‌, మాకినేని బసవపున్నయ్య ఫొటోలను ఏర్పాటు చేశారు. 'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలి, కార్మిక చట్టాలపై ప్రభుత్వ దాడిని విడనాడాలి, నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలి, ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలి' వంటి నినాదాలు పైలాన్‌పై ఉన్నాయి. ఈ ఫైలాన్‌ చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ మోదీ..

" దేశంలో 3 ప్రధాన సమస్యలు రాజకీయ త్రిమూర్తులుగా తయారయ్యాయి. ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ.. వాజ్‌పేయి కాలంలోని మతతత్వం.. మన్మోహన్‌ హయాంలోని నూతన ఆర్థిక విధానాలు కలిపితే మోడీ పాలన. ఈ మూడింటిని అడ్డుకోగలగడంపైనే వామపక్షాల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ప్రమాదాల నుంచి దేశాన్ని వామపక్షాలు తప్ప మరెవ్వరూ కాపాడలేరు "..  సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి. 

ఉవ్వెత్తున ఎగసిన ఎర్రజెండా..

సిపిఎం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంతో పాటు విజయవాడలో ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని శనివారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అరుణ పతాక యాత్రతో విజయవాడ నగరంఎరుపెక్కింది.వన్‌టౌన్‌లోని రథం సెంటరు నుంచి ప్రారంభమైన యాత్రలో 50 మీటర్ల మేర అరుణ పతాకాన్ని చేబూని రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు లెనిన్‌ సెంటరు వరకు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే సిపిఎం ధ్యేయమన్నారు. ప్రభుత్వాలు మారినా పాలకుల విధానాల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. మరో 20 ఏళ్లు పరిపాలన చేయాలని తెలుగుదేశం పార్టీ, 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ సిపి, పోగొట్టుకున్న అధికారాన్ని, పదవులను ఎలా దక్కించు కోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేస్తున్నాయన్నారు. వామపక్ష పార్టీగా సిపిఎం మాత్రం పదవులతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. దేశ సమైక్యత, మత సామరస్యం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్‌ చుట్టూ తిరుగుతూ రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని నిరుత్సాహపరిచే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  

Friday, 9 January 2015

టి.డి.పి నయా ఉదారవాద జిమ్మిక్కులు.. !

రాజకీయాలను, పార్టీని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నడిపిస్తూనే, మరో వైపున ప్రజలకు, కార్యకర్తలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్న భ్రమల్లో ముంచే నైపుణ్యాన్ని తెలుగుదేశం నేతలు బాగా వంటబట్టించుకున్నారని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి సి.హెచ్‌ బాబూరావు అన్నారు.దేశంలో ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నాయని,తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకు వేసి తమ పార్టీనే కార్పొరేట్‌ సంస్థగా మార్చేసి కార్పొరేట్‌ కంపెనీలకు మార్కెటింగ్‌ చేస్తోందన్నారు.మా పార్టీలో క్రియాశీల సభ్యులుగా చేరితే బీమా సదుపాయం, బస్సులలో ప్రయాణిస్తే 10 శాతం, ఆసుపత్రులలో 10 నుంచి 50 శాతం వరకు ఫీజులో తగ్గింపు అంటూ ప్రచారం చేస్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టే పనిలో బిజీగా ఉంది.100 రూపాయలు కడితే క్రియాశీల సభ్యత్వం, దానితోపాటే అనేక రాయితీలు అంటూ టిడిపి నేతలు హంగామా చేస్తున్నారు. సభ్యులుగా చేరినవారు ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా, అంగవైకల్యం ఏర్పడితే 50 శాతం నుంచి 100 శాతం బీమా అని ఊరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో చేరి, తమ జెండా పట్టుకున్న వారికే బీమా సౌకర్యం కల్పిస్తారా? రాష్ట్రంలోని పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పొదుపు సంఘాల సభ్యులు, ఇతర వర్గాల వారు అర్హులు కారా? అని ప్రశ్నించారు.పార్టీ అధినేత చంద్రబాబు పనితీరు, వారి ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరండని చెప్పుకోలేక ఇన్సూరెన్స్‌ కోసం తమ పార్టీలో చేరండని ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ బలమా? బలహీనతా?. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కేశినేని ట్రావెల్స్‌ బస్‌లలో ప్రయాణిస్తే 10 శాతం ఛార్జీలలో రాయితీలను ప్రకటించారు. అంటే ప్రయాణికులను ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించవద్దు, ప్రైవేట్‌ బస్‌లలోనే ప్రయాణం చేయండని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తున్నది. ప్రభుత్వ రంగాన్ని, ఆర్టీసీ సంస్థను నాశనం చేసి ప్రైవేట్‌ బస్‌ల యాజమాన్యానికి ప్రయోజనం కలిగించడానికి బహిరంగంగా అధికార పార్టీ ప్రచారం చేయడం నీతిమాలిన చర్య కాదా?. రాష్ట్రంలోని 27 కార్పొరేట్‌ ఆసుపత్రులలో తెలుగుదేశం క్రియాశీల సభ్యులకు 10 నుంచి 50 శాతం వరకు రాయితీలు అంటూ మరొక సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు కేటాయించకుండా వాటిని నాశనం చేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు రోగులను పంపే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోవడం ఆ పార్టీ నైజాన్ని తెలుపుతున్నది. కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు దళారీ వ్యవస్థను పెట్టుకుని రోగులను పంపిన వారికి కమీషన్లు ఇస్తాయి. మరి తెలుగుదేశం సభ్యులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపే విధానాన్ని ప్రకటించిన ఈ పార్టీని ఎలా పరిగణించాలి.పార్టీ, ప్రభుత్వ అధికారాన్ని సొంత ప్రయోజనాల కొరకు వాడుకోవడం, దానిని బహిరంగంగా సమర్థించు కోవడంలో తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసింది.

Thursday, 8 January 2015

ప్రపంచబ్యాంకు ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు...ఎం.ఎ గఫూర్

చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక ఉద్యమాలను అణచివేసి పెట్టుబడిదారుల మొదటి జీతగానిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని సి.పి.ఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం.ఎ గఫూర్ అన్నారు. ప్రపంచబ్యాంకు ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు ఏమాత్రం అవకాశం దొరికినా ఆ విధానాలను అమలుజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఓట్లువేసిన ప్రజలు కాకుండా ఎన్నికల నిధులు ఇచ్చిన పెట్టుబడిదారులే ముఖ్యమని, వారి సేవకు తను సర్వదా సిద్ధమనే సంకేతాన్ని ఇస్తున్నారు.స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మించాలంటే రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు మానవ సంపదను కూడా కారుచౌకగా కొల్లగొట్టేందుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు హక్కుగా ఇవ్వాలనేది చంద్రబాబు నమ్ముతున్న సిద్ధాంతం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులను అణచివేయడమే మార్గంగా భావించి కార్మికోద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. యానిమేటర్ల సమ్మెపై అణచివేత చర్యలు, అంగన్‌వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల వ్యతిరేకత, కృష్ణపట్నం, గంగవరంపోర్టు, అరవిందో ఫార్మా, తదితర కార్మికులపై పోలీసుల జులుం, కార్మిక సంఘాల పట్ల, వామపక్ష ఉద్యమాల పట్ల చంద్రబాబు చూపుతున్న అసహనం ఆయనలో దాగున్న నియంతృత్వాన్ని ముందుకు తెస్తున్నాయి.ఇందిరా క్రాంతిపథం (వెలుగు)లోని 20 వేల మంది యానిమేటర్లు ప్రధానంగా మహిళలు గత 12-15 సంవత్సరాలుగా ఎలాంటి వేతనాలు లేకుండానే వెట్టిచాకిరి చేస్తున్నారు.గతంలో అంగన్‌ వాడీలను గుర్రాలతో తొక్కించిన, విద్యుత్‌ ఉద్యమంపై కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు మరోసారి అందరికీ గుర్తుకు వచ్చారు.భారత దేశంలోకి పరిశ్రమలు రావాలంటే కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను కుదిస్తే తప్ప సాధ్యం కాదని ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోజూ ప్రకటనలు చేస్తున్నారు.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఋణమాఫీ ఒక ప్రహసనంగా మారింది. ఉపాధి హామీ పథకం నీరుగార్చబడింది. రైతు ఋణమాఫీలో కౌలుదార్లకు ఒరిగిందేమీలేదు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్న రాయలసీమలో ఆదుకునే దిక్కేలేదు. నిరుద్యోగ భృతి శుష్క ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయింది. విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంటు, హాస్టల్‌ ఛార్జీల పెరుగుదల ఊసే ప్రభుత్వం మరిచిపోయింది. ఈ పరిస్థితుల్లో కార్మికులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తమతమ డిమాండ్ల సాధనకై సమైక్య సమరానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

ఏడు లక్షల మంది కార్మికులు ఒకే తాటిపైకి..

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే ఏడు లక్షల మంది కార్మికులు భాగస్వాములై ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై తమ ఆగ్రహం వెలిబుచ్చడం సాధారణమైన విషయం కాదు.1977 తర్వాత అతి పెద్ద సమ్మె ఇదే.రెండు రోజులపాటు సాగించిన సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోల్‌ ఇండియాలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడం అసాధారణం.తెలంగాణాలోని సింగరేణిలోనూ కార్మికులు సమ్మె బాట పట్టారు.నయా ఉదారవాద విధానాల మత్తు తలకెక్కిన మోడీ సర్కారు బీమా, బ్యాంకింగ్‌, రక్షణ ఒకటేమిటి అన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు, కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. బొగ్గు గనులను సైతం మినహాయించలేదు. కుసంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున ప్రతిఘటనకు సిద్ధం కావడం స్వాగతించదగింది. తొలి మెట్టుగా బొగ్గు సమ్మె సరికొత్త చరిత్ర లిఖించింది.ఇప్పటికే ఓపెన్‌కాస్ట్‌ వంటి చర్యలతో బొగ్గు గనుల్లో కాంగ్రెస్‌ సర్కారు ప్రైవేటీకరణ చేపట్టగా బిజెపి మరింత వేగంగా కొనసాగించడం దారుణం. రూ.లక్షల కోట్ల బొగ్గు స్కాంకు మూలం ప్రైవేటీకరణే. 'సంస్కరణ'ల రంధితో కన్నూ మిన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బొగ్గు సమ్మె గట్టి సవాల్‌ విసిరింది. బొగ్గు గనుల్లో వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా జాతీయ స్థాయిలోని ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మెకు నడుం కట్టడం హర్షణీయం.

Wednesday, 7 January 2015

600 ఎకరాల లంకభూములు స్వాహా..?

రాజధాని ప్రాంతంలోని లంక భూములపై టిడిపి ప్రజాప్రతినిధుల కన్ను పడింది.తుళ్లూరుకు కిలోమీటరు దూరంలో ఉన్న రాయపూడి రెవెన్యూ గ్రామం, బోరుపాలెం గ్రామ పరిధిలో 600 ఎకరాల లంక భూమి ఉంది. ఇక్కడ పర్యాటక ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపిలు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు దీని కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.స్వయంగా పరిశీలించిన కొందరు కొంత భూమి కొనుగోలుకు రైతులతో బేరసారాలూ సాగించారు.600 ఎకరాల లంక భూమిలో కొద్దిమంది రైతుల చేతుల్లో 258 ఎకరాలు పట్టా భూమి ఉంది. భూ సమీకరణలో భాగంగా ఈ భూమిని తీసుకోవాలా, వద్దా అనే అంశంపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చ చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది. వీటిని తీసుకోని పక్షంలో పర్యాటక ప్రాజెక్టులకు కేటాయిం చాలని ఆలోచన చేసినట్లు తెలిసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి బోరుపాలెం వరకు ఎనిమిది లంకలున్నాయి. 138 ఎకరాల్లో భవానీద్వీపం కొంత పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉంది. మరో లంక ఉండవల్లి రెవెన్యూ 60 ఎకరాలకు పైబడి మరో లంక ఉంది. దీన్ని ఓ ఎంపి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. పండ్లతోటలు సాగుచేస్తున్నారు. దీంతోపాటు గొల్లపూడి రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు 300 ఎకరాల పైబడి లంక తయారైంది. మందడం రెవెన్యూ గ్రామ పరిధిలో తాళ్లాయపాలెంలో మరో లంక ఉంది. ఇవి కాకుండా రాయపూడి పరిధిలో మూడు లంకలు ఉన్నాయి. వీటిల్లో పెదలంక ఉంది.ఇందులో 125 నివాసాలు కూడా ఉన్నాయి. పూర్తిగా పట్టాభూమి కావడంతో రైతులు కూడా ఆయా లంకల్లోనే ఉండి సాగు చేసుకుంటున్నారు. వీటన్ని టిలోనూ ఒక్క పెదలంకలోనే పట్టాభూమి ఉండ టంతో దాన్ని స్వాధీనం చేసుకునే దిశగా పెద్దలు వాలిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఎలాగైనా కొనుగోలు చేసే పనిలో పడ్డారు. దీనికోసం అధికారులనూ వినియోగించుకుంటున్నారు.

అశాస్త్రీయ జనతా పార్టీ..

విద్యారంగంలో అశాస్త్రీయతను చొప్పించేందుకు బి.జె.పి ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య అన్నారు.దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో తమ వంతు కృషిని అందిస్తున్న ఎందరో భారతీయ శాస్త్రవేత్తలను అవమానపరిచేలా బి.జె.పి వ్యవహరిస్తోందన్నారు. వినాయకుడికి ఏనుగు ముఖాన్ని తగిలించడం ప్లాస్టిక్‌ సర్జరీయేననీ, కుంతీదేవికి కర్ణుడు జన్మించిన తీరు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియ కన్నా పురోగామి అనీ ప్రధాని మోడీ అనడంచూస్తుంటే అశాస్త్రీయతకు బి.జె.పి కాషాయ జెండా ఊపుతోందని విమర్శించారు. వంద రోజుల్లోనే విదేశాలలోని నల్లధనం 75 లక్షల కోట్ల రూపాయలను బయటికి తెస్తానని హామీ ఇచ్చిన మోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఆ మొత్తాన్ని కార్పోరేట్లకే ఇస్తున్నారన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినిర్వీర్యం చేయడంతోపాటు మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత దేశంలో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మోడీ,చంద్రబాబు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జగన్‌ ఏమీ మాట్లాడడం లేదని, బిజెపి సవాళ్ళను జగన్‌ స్వీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. వారికి ధీటైన సమాధానం చెప్పే శక్తి కేవలం సిపిఎం కే ఉందన్నారు.

Tuesday, 6 January 2015

రుణమాఫీ తొలిదశలోనే విఫలం...

తొలిదశ రుణమాఫీ అమలులోనే రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు,బ్యాంకర్లు పూర్తిగా విఫలమయ్యారు. మాఫీకి బ్యాంకర్లు సహకరించక పోవడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకర్లు రుణమాఫీకి సహకరించాలని కోరారు. రుణమాఫీలో రెండోదశ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నందున తొలిదశను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.తొలిదశ రుణమాఫీనే ఇంకా పూర్తిగా ఆచరణకు నోచుకోని తరుణంలో రెండోదశ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే దానిపై గందరగోళం నెలకొనివుంది. 

9 లక్షల మంది రైతాంగానికి నష్టం...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా భూ సమీకరణ ద్వారా రైతులకు అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మండిపడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టవిరుద్ధమని, ప్రభుత్వం రైతుల వద్ద బలవంతంగా భూములను గుంజుకుంటుందని ఇలాంటి తంతూ ఒక్క రాజధాని ప్రాంతంలోనే కాదని, విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల మంది రైతాంగం నష్టపోతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో 1.5లక్షల మంది దళితులు, గిరిజనులు ఉన్నారని వీరి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. భూ సమీకరణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కూడా అమలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రలోటు బడ్జెట్‌, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు వంటి అంశాల గురించి లేవనెత్తడం లేదని విమర్శించారు. ఈ చట్టవిరుద్ధమైన ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Monday, 5 January 2015

చట్టబద్ధత లేని ల్యాండ్‌ పూలింగ్‌..

ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు.రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత లేని ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి పూనుకుందన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కంటే, ఈ విధానం రైతులకు మరింత తీవ్ర నష్టం చేకూరుస్తుందని తెలిపారు. చంద్రబాబు పాలనంతా రాజధాని నిర్మాణం చుట్టే తిరుగుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.రాజకీయాల్లో కుల, మతాలను జోడించి ప్రజల మధ్య చీలిక తేవాలని బిజెపి ప్రయత్నిస్త్తోందని తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భూ అధికరణ చట్టానికి తూట్లు పొడిచి, ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల రైతుల ఆమోదం లేకుండానే ప్రభుత్వం భూమిని లాక్కోవడానికి మరింత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.ఉపాధి లేకే శ్రీకాకుళం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు పలు ప్రాంతాలకు వలస వెళ్తున్న విషయాన్ని నర్సింగరావు గుర్తుచేశారు.

ప్రభుత్వ సమాచారం అమెరికా చేతుల్లో..

ఇరవై ఏళ్ల కిందట ప్రారంభమైన సరళీకరణ విధానాల దాడిని ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదలాలని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియాను అడ్డుపెట్టుకుని బహుళజాతి కంపెనీలు దేశంపై డాడి చేస్తున్నాయన్నారు. ఇండియాలో కోటి వైబ్‌సైట్లు ఉంటే.. వాటి సర్వర్లు అమెరికాలో ఉన్నాయని వివరించారు. మన ప్రభుత్వ, ప్రయివేటు సమాచారం మొత్తం అమెరికా చేతుల్లో ఉందన్న విషయం మరవరాదన్నారు.దేశంతో న్యూక్లియర్‌ ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 26న ఢిల్లీలో జరిగే మన రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్న ఒబమా పర్యటను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఆ రోజు నిరసన తెలపాలని ఆరు వామపక్షాలు పిలుపునిచ్చాయని గుర్తుచేశారు. మిలిటరీ శక్తి లేకుంటే అమెరికా ఎప్పుడో కుప్పకూలేదన్నారు. 50 ఏళ్ల నుండి క్యూబాపై అనేక ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు స్నేహహస్తం చాచడం వెనుక కారణాలు పరిశీలించాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, మోడీ మతోన్మాద కార్యక్రమాలను నిలువరించే దిశగా ఐక్య ఉద్యమాలు పెరగాలన్నారు. సరళీకరణ విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో పడిందన్నారు. 

మసీదులు, చర్చిలు కూల్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కుయుక్తులు..

తిరుపతిలాంటి నగరాల్లో మసీదులు, చర్చిలు కూల్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కుయుక్తులు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేయడాన్ని లౌకికవాద శక్తులు తీవ్రంగా పరిగణించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు.రాష్ట్రంలోని టిడిపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈ విధానాల్ని తప్పుబట్టలేని హీన స్థితిలో ఉన్నాయని చెప్పారు.ఎన్‌డిఎ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు రెడ్‌కార్పెట్‌ పరుస్తూనే మతతత్వ అజెండాతో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు అనుకూలంగా వుంటూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ భవిష్యత్తులో మరిన్ని భారాలు మోపే ప్రమాదముందన్నారు.కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎర్రజెండా ప్రత్యక్షమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

Sunday, 4 January 2015

4000 కోట్లు వరకూ ప్రజలపై భారం.. వై.వి

విజయవాడ ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, రాజధానికి భూములు ఎంత తీసుకుంటారు, ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రకటించకుండా దాటవేస్తున్నారన్నారు. భూములు కోల్పోయే రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారుల గురించి పాలకులు పట్టించుకోవటం లేదని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు సంక్రాంతి తర్వాత పెంచేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సుమారు రూ. 4000 కోట్లు వరకూ ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్ధంచేస్తున్నారన్నారు. పట్టణాలు, నగరాల్లో ఆస్తి, ఇతర పన్నులను పెద్దఎత్తున పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఇటీవల మున్సిపల్‌ శాఖమంత్రి నారాయణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే టిడిపి, బిజెపి పాలకులు కమ్యూనిస్టులపై సైద్ధాంతిక దాడికి దిగుతున్నారరి, దీన్ని ఎదుర్కొనాలంటే పార్టీ శ్రేణులు మారుతున్న పరిస్థితులకనుగుణంగా అధ్యయాన్ని పెంచుకోవాలని సూచించారు.

బూర్జువా పార్టీలతో సర్దుబాటు వైఖరి విడనాడాలి..

సిపిఎం కృష్ణా జిల్లా 22వ మహాసభలు మచిలీపట్నంలో జరిగాయి. ప్రతినిధులనుద్దేశించి రాఘవులు మాట్లాడుతూ బూర్జువా పార్టీలతో సర్దుబాటు వైఖరి విడనాడి, రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సివుందన్నారు.అసంఖ్యాకంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులను ఐక్యంచేసి వారికి అండగా జరిగే ఉద్యమాల్లో పార్టీ కీలకంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. విదేశీ పాశ్చ్యాత్యీకరణ నేపథ్యంలో మన సంస్కృతిపై ప్రపంచీకరణ దాడిని తిప్పికొట్టేందుకు ప్రజాసంస్కృతి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలు మరింత పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్య లపై కలిసొచ్చే సంఘా లను కలుపుక ుపోవాలని సూచిం చారు. 

Friday, 2 January 2015

'నీతి మాలిన ఆయోగ్‌'

ప్రణాళికా సంఘాన్నిరద్దు చేసి, దాని స్థానే "నీతి ఆయోగ్‌" ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వనరులను ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు మోడీ సర్కారు సైద్ధాంతిక తలుపులు తెరిచిందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం ఈ 'నీతి ఆయోగ్‌' వ్యవస్థను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, ప్రజల జీవనం వంటి వాటిని నిర్వీర్యం చేసేందుకేనని ధ్వజమెత్తింది. ప్రభుత్వ రంగానికి జరుపుతున్న కేటాయింపులు, ప్రాంతీయ అసమానతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే ప్రణాళికా సంఘం పాత్రకు దీనితో తెరపడినట్టేనని వ్యాఖ్యానించింది.రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకారాత్మక సమాఖ్య భావన ఆధారంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్న మోడీ సర్కారు ప్రకటన వట్టి బూటకమని,జాతీయాభివృద్ధి మండలి స్థానే ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎలాంటి అధికారాలు లేవని, ఈ మండలి ప్రధాని, ప్రధాని కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఇది కేంద్రీకృత ఏకపక్ష వ్యవస్థ మాత్రమేనని  పేర్కొంది. కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు నిధుల కేటాయింపులన్నీ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ విచక్షణకు రాష్ట్రాలను బలిచేయటమేనని మార్క్సిస్టు పార్టీ విమర్శించింది. 'అన్నింటికీ ఒకే మంత్ర'మన్న ధోరణితో ఎటువంటి ఉమ్మడి మార్గదర్శకాలు, నియమ నిబంధనలు లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించటం ద్వారా కేంద్రం రాష్ట్రాలను తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తోందని విమర్శించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం రాజకీయ బేరసారాలకు తెరతీసిందని తెలిపింది.

రాష్ట్ర ప్రజలకు స్మార్ట్ షాక్..?

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడానికి టి.డి.పి ప్రభుత్వం సిద్దమౌతోంది.నెలకు వందయూనిట్లకు మించి వినియోగించే వారికి ఛార్జీలు పెంచాలన్న ప్రాథమిక నిర్ణయానికి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. విద్యుత్‌ ఛార్జీల పెంపు అంశంపై గతంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, అధికారాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రవేశపెట్టిన తరువాత తనకు అత్యవసరమైన సమావేశం ఉందని చెబుతూ ఆయన మంత్రిమండలి నుండి బయటకు వచ్చేశారు.ఈ సమావేశంలో కొందరు మంత్రులు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గత అనుభవాలను ప్రస్తావిస్తూ విద్యుత్‌ జోలికి వెళ్లడం మంచిదికాదన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేశారు. అయితే, ఎక్కువ మంది మంత్రులు ఛార్జీల పెంపు ప్రతిపాదనను సమర్ధించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కూడా సమావేశంలో లేకపోవడంతో సంక్రాంతి తరువాత దీనిపై చర్చించి తుది నిర్ణయానికి రావాలన్న అభిప్రాయానికి మంత్రులు వచ్చారు.

ఇంకా 'రైతు రుణం' తీర్చుకోని ప్రభుత్వం..

అందరికీ రుణమాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టాల్సిన పని లేదని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టిడిపి, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు షరతులతో మాఫీని అమలుచేస్తుండటంతో రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.ధ్రువీకరణ పత్రాలలో జాప్యం, ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను తప్పుగా నమోదు చేయడం, అసలు నమోదు చేయకపోవడం బీమా కార్డు ఆన్‌లైన్‌ చేయకపోవడం అర్హత ఉన్న కొద్ది మంది రైతుల వివరాలను అండర్‌ ప్రాసెస్‌గా నమోదు చేయడం, పెండింగ్‌ అంటూ కొందరు రైతుల పేర్లను వెబ్‌సైట్‌లో ఉంచటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో జనవరి 9వ తేదీలోపు రైతులు అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. అందుకోసం జిఓ నెం.220ను విడుదల చేసింది. రైతులు క్షేత్రస్థాయిలో తహశీల్దార్‌, బ్యాంక్‌ మేనేజర్‌ మండల వ్యవసాయాశాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.ఈ దరఖాస్తులనీ జన్మభూమి కమిటీకి పంపిస్తామని, ఇంకా ధ్రువపత్రాలు ఇవ్వాల్సినవారు కమిటీకి రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకర్లు గురువారం ప్రకటించారు. దీంతో రైతులు మరోసారి కంగుతిన్నారు.
             అర్హత ఉన్నప్పటికీ అండర్‌ ప్రాసెస్‌ అని చూపిన రైతులకు రుణమాఫీని అమలుచేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలని ఒకసారి, నేడు జన్మభూమి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని మరోసారి బ్యాంకర్లు, అధికారులు చెబుతున్నారు. తీసుకున్న ధరఖాస్తులన్నీ ఎప్పుడు ఆన్‌లైన్‌ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ యంత్రాగం చేసిన తప్పులకు రైతులను రుణమాఫీకి దూరం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల ప్రభుత్వోద్యోగులకు కూడా రుణమాఫీ వర్తించిన వైనాలున్నాయి.

Thursday, 1 January 2015

మోడీ సర్కారు నియంతృత్వ పోకడలకు మరో నిదర్శనం.. 'ఆర్డినెన్స్‌ రాజ్‌'

  బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్సు రూటులో భూ సేకరణ చట్ట సవరణలు తీసుకురావడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది.సరళీకరణ విధానాలు రాకముందు దేశంలో 'లైసెన్స్‌, పర్మిట్‌ రాజ్‌' నడుస్తోందని బిజెపి నాయకులు విమర్శించేవారు. ఇప్పుడు వారు 'ఆర్డినెన్స్‌ రాజ్‌' సాగిస్తున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. 'సమ్మతి' క్లాజును తొలగించడం, 'సామాజిక ప్రభావ మదింపు' అవసరం లేదనడం భూ సేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే! ఈ ఆర్డినెన్స్‌తో ప్రజా వ్యతిరేకమైన భూసేకరణ చట్టం (1894) తిరిగి అమలులోకి వచ్చినట్టవుతుంది.భూ సేకరణ చట్టంలో అత్యంత కీలకమైన 'సమ్మతి'పైనే ఈ ఆర్డినెన్స్‌ వేటు వేసింది. సమ్మతి అక్కర్లేదంటే గతంలో మాదిరిగా బలవంతపు భూ సేకరణ జరపొచ్చని చెప్పడమే గదా! సమ్మతి పొందాల్సిన ప్రజల శాతాన్ని 80 నుంచి 67కు తగ్గించాలని కార్పొరేట్‌ శక్తులు గతంలో కోరాయి. కానీ సర్కారు ఏకంగా 'సమ్మతి' అవసరమే లేదని ఆర్డినెన్స్‌ తేవడం ఆశ్చర్యకరం. బహుశా అందుకనే ఆర్డినెన్స్‌ ఆమోదించిన వెంటనే పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లూ హర్షం వెలిబుచ్చారు. సేకరించనున్న భూమిలో ఏ ప్రాజెక్టు నిర్మించేదీ, దాని ప్రభావం, అందుకు కనీసంగా అవసరమైన భూమి మొదలైన వివరాలన్నీ సామాజిక ప్రభావ మదింపు నివేదిక (ఎస్‌ఐఎ)లో ఉంటాయి. కనుక ఆ భూమి భవిష్యత్తు రూపం ఎలా ఉండేదీ, పర్యవసానాలు ఎలా ఉండబోయేదీ ప్రజలకు తెలుస్తుంది. ఇలాంటి అంశాలన్నిటినీ గ్రామసభలో చర్చించాక దాని సమ్మతి మేరకు సేకరణ చేపట్టాల్సి ఉండేది. కానీ ఆర్డినెన్స్‌లో సామాజిక ప్రభావ అంచనా నివేదికే అక్కర్లేదని చెప్పడంతో ఈ ప్రక్రియనంతటినీ గాలికొది లేసినట్టే. సుదీర్ఘ ఆందోళనలు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూ సేకరణ, పునరావాస పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం పొందడానికీ పారదర్శకతకు హక్కు చట్టం(2013) ఇక 'కరి మింగిన వెలగ పండు' చందమే అవుతుంది. జాతీయ భద్రత, రక్షణ ఉత్పత్తులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం సహా సామాజిక మౌలిక సౌకర్యాల నిర్మాణం కోసం భూమిని సేకరిస్తే 'సమ్మతి' నిబంధన,  'సామాజిక ప్రభావ మదింపు' వర్తించవని కేంద్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ ఆమోదించడం అప్రజాస్వామికం, అనైతికం.నీటిపారుదల సౌకర్యం కలిగి బహుళ పంటలు పండే భూములను సేకరించరాదని చట్టం నిర్దేశిస్తోంది. ఆర్డినెన్స్‌లో దాన్ని కూడా తొలగించడంతో చట్టం మరింత నిర్వీర్యం కావడమేగాక ఆహార భద్రతకు పెనుముప్పు కలుగుతుంది. ఇక ప్రజా ప్రయోజనం పరిధిలోకి ప్రైవేట్‌ హోటళ్లతో సహా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులనూ చేర్చడంతో భూ సేకరణ చట్టం బలవంతపు భూ స్వాధీన చట్టంగా మారిపోతుంది.భూ సేకరణ చట్టం (2013) కేవలం భూ యజమానులకు మాత్రమేగాక, ఆ భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, ఇతర పేదల ప్రయోజనాల రక్షణకు వీలు కల్పిస్తుంది. ఆర్డినెన్స్‌ ద్వారా ఆర్థిక పరిహారం కేవలం భూ యజమానులకు మాత్రమే లభిస్తుంది గనుక భూమిపై ఆధారపడి జీవించేవారి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసీముగియగానే బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఆర్డినెన్సులు తెచ్చిన బిజెపి సర్కారు ఇప్పుడీ ఆర్డినెన్స్‌ను చేయడం మరింత దారుణం.

Tuesday, 30 December 2014

బలవంతంగానైనా భూసమీకరణ..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

సీఆర్‌డిఏ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూ సమీకరణపై రైతులకు బుధవారం నుంచి నోటీసులు పంపుతామని, ప్రభుత్వం ఏయే అవసరాల నిమిత్తం భూమి తీసుకుంటుందో వివరిస్తూ నోటీసులిస్తారు. వీటిపై అభ్యంతరం ఉన్నా, భూమి ఇవ్వడానికి ఇష్టంలేకపోయినా 15 రోజుల్లోగా తెలియ జేయాలి.లేదంటే వారు భూమి ఇవ్వడానికి అంగీకరించినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుని రశీదు ఇస్తారు. అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా భూమి హక్కు పత్రాలను పరిశీలించి సంబంధిత హక్కుదారులకు ఆరు నెలల్లోగా బాండ్లు ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు వివరిస్తారు. అఫిడవిట్లు, భూమి హక్కుపత్రాల పరిశీలన పూర్తయిన తరువాత బాండ్లు, కౌలు పరిహారం పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం 27 మంది డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి. 29 గ్రామాల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. ఒక్కో డిప్యూటీ కలెక్టర్‌ పరిధిలో 1000 నుంచి 1400 ఎకరాల స్థలం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులను సీఆర్‌డిఏకు కేటాయిస్తుంది. వీరి ఆధ్వర్యంలో ప్రతి బృందంలో ఇద్దరు తహశీల్దార్‌లు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు సర్వేయర్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సర్వే విభాగం సిబ్బంది, వీరితోపాటు స్థానిక వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, ఒక కంప్యూటర్‌ ఆపరేటరు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తం 300 మంది రెవెన్యూశాఖ తరఫున రాజధాని గ్రామాల్లో పనిచేయనున్నారు.  ఈ ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సంకల్పించామని క్రిడా కమిషనర్‌ శ్రీకాంత్‌ చెబుతున్నారు.