Friday 30 January 2015

ప్రజా రాజధాని కాదు కార్పొరేట్ అడ్డా..బివి రాఘవులు

రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం పూర్తిగా కార్పొరేట్‌ రాజధానిగానే నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది.కడుపులో నీళ్లు కదలకుండా విమానాల్లో, కోట్ల విలువైన కార్లలో తిరుగుతూ కాలం గడుపుతున్న వారి చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం తీసుకోవచ్చు. రాజధాని నిర్మాణంలో కీలకమైన కృష్ణానది కరకట్ట భాగంలో ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకూ ఉన్న పది గ్రామాలను పూర్తిగా పోలీసులతో నింపేసింది. పెద్దల చేతుల్లో కృష్ణానదికి ఆనుకుని ఉన్న భూములు, వాటిల్లో ఉన్న నిర్మాణాల జోలికెళ్లడం లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి బోటులో వెంకటపాలెం వరకూ వెళితే నదిని ఆక్రమించి, పూడ్చి నిర్మించిన లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు కనిపిస్తాయి. అందమైన, అధ్భుతమైన నిర్మాణాలు, వీటిల్లో ఏ ఒక్క భవనానికీ నదీ పరీవాహక పరిరక్షణ చట్టం నుంచి మినహాయిస్తున్నట్లు(ఎన్‌ఓసి) అనుమతులు లేవు. యథేచ్ఛగా నిర్మించేశారు. గతంలో అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. నిర్మించినవారిలో ఎక్కువమంది ఆయా పార్టీలకు చెందినవారే ఉన్నారు.కరకట్ట వెంబడి ఉన్న పొలాలన్నిటినీ  బిజెపి పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు(ఎంపి) గోకరాజు గంగరాజు స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్‌ భూములూ లీజు పేరుతో ఆయన చేతుల్లోనే ఉన్నాయి. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లేని నిర్మాణాలు 2.53 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే వాటిల్లో గంగరాజుకు చెందినవే 58 సెంట్లలో ఉన్నాయి. దీనిలో నదిని పూర్తిగా ఆక్రమించి హంగూ, ఆర్భాటాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన విడిది భవనమూ ఉంది.  రాజధాని భూ సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే తన పొలాలు, భవనాల మధ్యలో ఉన్న అరెకరం స్థలాన్ని శ్యాంప్రసాద్‌ ముఖర్టీ ట్రస్టుకు బిజెపి ఎంపి గంగరాజు రాసిచ్చినట్లు తెలిసింది. దీనిలో భవన నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్దిశాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల శంకుస్థాపన చేశారు. . తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు చెబుతున్న పారదర్శకత అనే పదానికి అర్థం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రజా రాజధాని అన్నమాటకు విలువ లేకుండా పోతుంది.పేదలన్నా, రైతులన్నా ఏ మాత్రమూ కనికరం లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు కన్నబిడ్డల్లాంటి పొలాలను లాక్కుని కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం కట్టబెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.  

No comments:

Post a Comment