Communist party of India (Marxist) - Andhra Pradesh
Thursday, 8 January 2015
ప్రపంచబ్యాంకు ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు...ఎం.ఎ గఫూర్
చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక ఉద్యమాలను
అణచివేసి పెట్టుబడిదారుల మొదటి జీతగానిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు
ప్రవర్తిస్తున్నారని సి.పి.ఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం.ఎ గఫూర్ అన్నారు. ప్రపంచబ్యాంకు
ఉగ్గుపాలతో పెరిగిన చంద్రబాబు ఏమాత్రం అవకాశం దొరికినా ఆ విధానాలను
అమలుజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఓట్లువేసిన ప్రజలు కాకుండా ఎన్నికల నిధులు ఇచ్చిన పెట్టుబడిదారులే
ముఖ్యమని, వారి సేవకు తను సర్వదా సిద్ధమనే సంకేతాన్ని ఇస్తున్నారు.స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలంటే రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు మానవ
సంపదను కూడా కారుచౌకగా కొల్లగొట్టేందుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు
హక్కుగా ఇవ్వాలనేది చంద్రబాబు నమ్ముతున్న సిద్ధాంతం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులను అణచివేయడమే మార్గంగా
భావించి కార్మికోద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు.
యానిమేటర్ల సమ్మెపై అణచివేత చర్యలు, అంగన్‌వాడీల సమస్యల పట్ల నిర్లక్ష్యం,
ఫీల్డ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపు, కాంట్రాక్టు,
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వ్యతిరేకత, కృష్ణపట్నం, గంగవరంపోర్టు,
అరవిందో ఫార్మా, తదితర కార్మికులపై పోలీసుల జులుం, కార్మిక సంఘాల పట్ల,
వామపక్ష ఉద్యమాల పట్ల చంద్రబాబు చూపుతున్న అసహనం ఆయనలో దాగున్న
నియంతృత్వాన్ని ముందుకు తెస్తున్నాయి.ఇందిరా క్రాంతిపథం (వెలుగు)లోని 20 వేల మంది యానిమేటర్లు ప్రధానంగా మహిళలు
గత 12-15 సంవత్సరాలుగా ఎలాంటి వేతనాలు లేకుండానే వెట్టిచాకిరి
చేస్తున్నారు.గతంలో అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించిన, విద్యుత్ ఉద్యమంపై కాల్పులు
జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు మరోసారి అందరికీ గుర్తుకు
వచ్చారు.భారత దేశంలోకి పరిశ్రమలు రావాలంటే కార్మిక చట్టాలను సవరించి కార్మిక
హక్కులను కుదిస్తే తప్ప సాధ్యం కాదని ''మేక్ ఇన్ ఇండియా'' పేరిట
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోజూ ప్రకటనలు చేస్తున్నారు.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఋణమాఫీ ఒక ప్రహసనంగా మారింది. ఉపాధి హామీ పథకం
నీరుగార్చబడింది. రైతు ఋణమాఫీలో కౌలుదార్లకు ఒరిగిందేమీలేదు. వ్యవసాయ
కూలీలు వలసలు పోతున్న రాయలసీమలో ఆదుకునే దిక్కేలేదు. నిరుద్యోగ భృతి శుష్క
ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయింది. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంటు,
హాస్టల్ ఛార్జీల పెరుగుదల ఊసే ప్రభుత్వం మరిచిపోయింది. ఈ పరిస్థితుల్లో
కార్మికులు మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తమతమ డిమాండ్ల సాధనకై
సమైక్య సమరానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment