Friday 2 January 2015

'నీతి మాలిన ఆయోగ్‌'

ప్రణాళికా సంఘాన్నిరద్దు చేసి, దాని స్థానే "నీతి ఆయోగ్‌" ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వనరులను ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు మోడీ సర్కారు సైద్ధాంతిక తలుపులు తెరిచిందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం ఈ 'నీతి ఆయోగ్‌' వ్యవస్థను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, ప్రజల జీవనం వంటి వాటిని నిర్వీర్యం చేసేందుకేనని ధ్వజమెత్తింది. ప్రభుత్వ రంగానికి జరుపుతున్న కేటాయింపులు, ప్రాంతీయ అసమానతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే ప్రణాళికా సంఘం పాత్రకు దీనితో తెరపడినట్టేనని వ్యాఖ్యానించింది.రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకారాత్మక సమాఖ్య భావన ఆధారంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్న మోడీ సర్కారు ప్రకటన వట్టి బూటకమని,జాతీయాభివృద్ధి మండలి స్థానే ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎలాంటి అధికారాలు లేవని, ఈ మండలి ప్రధాని, ప్రధాని కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఇది కేంద్రీకృత ఏకపక్ష వ్యవస్థ మాత్రమేనని  పేర్కొంది. కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు నిధుల కేటాయింపులన్నీ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ విచక్షణకు రాష్ట్రాలను బలిచేయటమేనని మార్క్సిస్టు పార్టీ విమర్శించింది. 'అన్నింటికీ ఒకే మంత్ర'మన్న ధోరణితో ఎటువంటి ఉమ్మడి మార్గదర్శకాలు, నియమ నిబంధనలు లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించటం ద్వారా కేంద్రం రాష్ట్రాలను తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తోందని విమర్శించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం రాజకీయ బేరసారాలకు తెరతీసిందని తెలిపింది.

No comments:

Post a Comment