టి.డి.పి నయా ఉదారవాద జిమ్మిక్కులు.. !
రాజకీయాలను, పార్టీని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నడిపిస్తూనే, మరో వైపున ప్రజలకు, కార్యకర్తలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్న భ్రమల్లో ముంచే నైపుణ్యాన్ని తెలుగుదేశం నేతలు బాగా వంటబట్టించుకున్నారని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి సి.హెచ్ బాబూరావు అన్నారు.దేశంలో ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కార్పొరేట్ కంపెనీలకు
అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నాయని,తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకు
వేసి తమ పార్టీనే కార్పొరేట్ సంస్థగా మార్చేసి కార్పొరేట్ కంపెనీలకు
మార్కెటింగ్ చేస్తోందన్నారు.మా పార్టీలో
క్రియాశీల సభ్యులుగా చేరితే బీమా సదుపాయం, బస్సులలో ప్రయాణిస్తే 10 శాతం,
ఆసుపత్రులలో 10 నుంచి 50 శాతం వరకు ఫీజులో తగ్గింపు అంటూ ప్రచారం చేస్తూ
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టే పనిలో బిజీగా ఉంది.100 రూపాయలు కడితే క్రియాశీల సభ్యత్వం, దానితోపాటే అనేక రాయితీలు అంటూ
టిడిపి నేతలు హంగామా చేస్తున్నారు. సభ్యులుగా చేరినవారు ప్రమాదవశాత్తు
చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా, అంగవైకల్యం ఏర్పడితే 50 శాతం నుంచి 100 శాతం
బీమా అని ఊరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో చేరి, తమ జెండా పట్టుకున్న వారికే బీమా సౌకర్యం
కల్పిస్తారా? రాష్ట్రంలోని పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పొదుపు
సంఘాల సభ్యులు, ఇతర వర్గాల వారు అర్హులు కారా? అని ప్రశ్నించారు.పార్టీ అధినేత చంద్రబాబు పనితీరు, వారి ప్రభుత్వ కార్యక్రమాలు,
అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరండని చెప్పుకోలేక ఇన్సూరెన్స్ కోసం తమ
పార్టీలో చేరండని ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీ బలమా? బలహీనతా?. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కేశినేని ట్రావెల్స్ బస్‌లలో
ప్రయాణిస్తే 10 శాతం ఛార్జీలలో రాయితీలను ప్రకటించారు. అంటే ప్రయాణికులను
ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించవద్దు, ప్రైవేట్ బస్‌లలోనే ప్రయాణం చేయండని
తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తున్నది. ప్రభుత్వ రంగాన్ని, ఆర్టీసీ సంస్థను
నాశనం చేసి ప్రైవేట్ బస్‌ల యాజమాన్యానికి ప్రయోజనం కలిగించడానికి
బహిరంగంగా అధికార పార్టీ ప్రచారం చేయడం నీతిమాలిన చర్య కాదా?. రాష్ట్రంలోని 27 కార్పొరేట్ ఆసుపత్రులలో తెలుగుదేశం క్రియాశీల సభ్యులకు
10 నుంచి 50 శాతం వరకు రాయితీలు అంటూ మరొక సౌకర్యం కల్పిస్తున్నట్లు
చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు కేటాయించకుండా వాటిని నాశనం
చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులను పంపే బాధ్యత తెలుగుదేశం పార్టీ
తీసుకోవడం ఆ పార్టీ నైజాన్ని తెలుపుతున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల
యాజమాన్యాలు దళారీ వ్యవస్థను పెట్టుకుని రోగులను పంపిన వారికి కమీషన్లు
ఇస్తాయి. మరి తెలుగుదేశం సభ్యులను కార్పొరేట్ ఆసుపత్రులకు పంపే విధానాన్ని
ప్రకటించిన ఈ పార్టీని ఎలా పరిగణించాలి.పార్టీ, ప్రభుత్వ
అధికారాన్ని సొంత ప్రయోజనాల కొరకు వాడుకోవడం, దానిని బహిరంగంగా సమర్థించు
కోవడంలో తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసింది.
No comments:
Post a Comment