Saturday 25 July 2015

ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..

కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు జీత, బత్యాలు పెంచి ఖాజానాపై కోట్ల రూపాయల భారం వేశాడు. మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ, స్వదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
             రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాజధాని నిర్మాణం, 13 జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్లు లాంటి అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేర్చడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారు. కొత్తగా నిర్మించబోయే రాజధాని నగరం చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరిపై దాదాపు రూ.1,000 కోట్ల పన్నుల భారాన్ని వేయడానికి పథకం తయారు చేసినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన మమకారంతో కాబోలు ఆయన కేంద్ర ప్రభుత్వంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారు.
             గత సంవత్సరం సకాలంలో తగినంత వర్షాలు కురవక పోవడంతో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాలు సకాలంలో రద్దు కానందున రైతులకు బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వలేదు. ప్రకృతి నిరాదరణ, ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం వల్ల పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతిని చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు వేస్తున్నది. గత నాలుగు నెలల క్రితం దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.4ల పన్ను (వ్యాట్‌) పెంచాడు. వ్యవసాయానికి డీజిల్‌ ఇంజన్లను ఉపయోగించే రైతులు, ప్రజలను గమ్యానికి చేర్చే వాహనదారులపై పెను భారం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీజిల్‌పై పన్నులు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.

Friday 24 July 2015

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన అంశాలేమైనా పరిష్కారం నోచుకున్నది లేదు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రుల వాగ్ధోరణులు శ్రుతి మించి చివరకు ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి చేరాయి. ప్రాజెక్టుల నుంచి శాంతిభద్రతల వరకూ ప్రతిదీ ఎడతెగని ఘర్షణ వాతావరణానికే దారి తీశాయి. మొదటి ఏడాది పూర్తి చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎంతమాత్రం మేలు చేయని అవాంఛనీయ పరిస్థితి ఇది. మొత్తంపైన తెలుగు ప్రజలు సుహృద్భావం నిలబెట్టుకున్నా పాలకులు, పాలక పక్షాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రెచ్చగొట్టడమే ధ్యేయంగా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం.
తెలకపల్లి రవి

Wednesday 8 July 2015

ఆర్థిక అసమానతలు

ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. 
               ఐఎమ్‌ఎఫ్‌ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్‌మార్కెట్‌ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు అభివృద్ధి రేటును నిలువరించడానికి గల కారణాల్లో తీసివేయలేనివని తెలియజేసింది. ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఆర్థికవేత్త బ్లాంచన్‌ ''మనం ఇప్పుడు క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి దశలో నడుస్తున్నాం'' అని అన్నారు. 2016లో 3.8 శాతం వృద్ధితో మరలా ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మందకొండి అభివృద్ధి, పేరుకుపోతున్న రుణాల కారణంగా నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నదని అంచనావేసింది. యూరప్‌లో గడచిన అయిదు సంవత్సరాల్లో మూడవ మాంద్యం త్రుటిలో తప్పినట్లు తన నివేదికలో పేర్కొంది. అభివృద్ధిచెందుతున్న దేశాల వృద్ధిరేటు ఏప్రిల్‌లో 2.4 శాతం ఉంటుందని చెప్పగా ప్రస్తుతం ఈ సంవత్సరానికి తాజాగా 2.1 శాతం ఉంటుందని తేల్చింది. అభివృద్ధిచెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లలో అంచనాల కంటే తక్కువ ఉంటుందని తెలియజేస్తోంది. అమెరికాలో ఏప్రిల్‌ 2015లో 3.1 శాతం అంచనా వేయగా, ఇప్పుడు 2.5 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అంటుంది.