రిపబ్లిక్ డే రోజున 'విశిష్ట అతిథి'గా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మూడురోజులపాటు భారత్‌లో హల్‌చల్ చేశారు.అమెరికా
తన 'దక్షిణ ఆసియా ఇరుసు'కు మేకుగా భారత్‌ను మార్చాలనే ఆలోచనలో ఉన్నది. ప్రపంచ స్థాయిలో ప్రాబల్యంగల రాజ్యంగా అవతరించాలనే కాంక్ష
భారతీయ పాలక వర్గాలను అమెరికా పెట్టుబడులపై ఆధారపడేలా చేస్తున్నది. దానికి అనుగుణంగానే
ఒబామా-మోడీలు తాజాగా 10 సంవత్సరాల సైనిక సహకార ఒప్పందాన్ని
కొనసాగించటానికి పరస్పర అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. భారత్-అమెరికా సంయుక్త రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం
చొరవ(డిటిటిఐ)లో భాగంగా నాలుగు రక్షణ వ్యవస్థల ఉత్పత్తులు మొదలవుతాయని
ఒబామా-మొడీ ప్రకటించారు. ఈ చొరవ ప్రధానోద్దేశం ఏమంటే భారత్ తన
రక్షణావసరాలకై అమెరికాపై ఆధారపడేలా చేయటం. అంతేకాకుండా దీర్ఘకాలంగా
కొనసాగుతున్న భారత్-రష్యా స్నేహ బంధాన్ని నాశనం చేయటం కూడా ఈ వ్యూహంలో
భాగమే. ఆసియా-పసిఫిిక్, హిందూ మహాసముద్ర ప్రాంతం గురించి ఒబామా-మోడీ సంయుక్త ప్రకటనలో వెల్లడించిన అభిప్రాయం దక్షిణ చైనా సముద్రంలో తూర్పు ఆసియా దేశాలకు, చైనాకు మధ్య వివాదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నది. 2010లో భారత పార్లమెంటు చేసిన పౌర అణు నష్టపరిహారం బాధ్యత ఒప్పంద చట్టం
అణు ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు పరిహారం చెల్లించే బాధ్యతను అణు
రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీపై ఉంచింది. అయితే మోడీ ప్రభుత్వం ఆ
చట్టాన్ని నిర్వీర్యం చేసి బాధ్యతను భారత దేశ ప్రజలపైకి నెట్టింది. అంతిమంగా చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానానికి అనుబంధంగా భారత విదేశాంగ
విధానాన్ని మార్చటానికి మోడీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. అంటే అమెరికా
కాంక్షించే ఏక ధృవ ప్రపంచంపై ఆధిపత్యాన్ని చలాయించటానికి సహాయపడే
వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశం మారబోతున్నది.
No comments:
Post a Comment