Thursday 8 January 2015

ఏడు లక్షల మంది కార్మికులు ఒకే తాటిపైకి..

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే ఏడు లక్షల మంది కార్మికులు భాగస్వాములై ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై తమ ఆగ్రహం వెలిబుచ్చడం సాధారణమైన విషయం కాదు.1977 తర్వాత అతి పెద్ద సమ్మె ఇదే.రెండు రోజులపాటు సాగించిన సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోల్‌ ఇండియాలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడం అసాధారణం.తెలంగాణాలోని సింగరేణిలోనూ కార్మికులు సమ్మె బాట పట్టారు.నయా ఉదారవాద విధానాల మత్తు తలకెక్కిన మోడీ సర్కారు బీమా, బ్యాంకింగ్‌, రక్షణ ఒకటేమిటి అన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు, కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. బొగ్గు గనులను సైతం మినహాయించలేదు. కుసంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున ప్రతిఘటనకు సిద్ధం కావడం స్వాగతించదగింది. తొలి మెట్టుగా బొగ్గు సమ్మె సరికొత్త చరిత్ర లిఖించింది.ఇప్పటికే ఓపెన్‌కాస్ట్‌ వంటి చర్యలతో బొగ్గు గనుల్లో కాంగ్రెస్‌ సర్కారు ప్రైవేటీకరణ చేపట్టగా బిజెపి మరింత వేగంగా కొనసాగించడం దారుణం. రూ.లక్షల కోట్ల బొగ్గు స్కాంకు మూలం ప్రైవేటీకరణే. 'సంస్కరణ'ల రంధితో కన్నూ మిన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బొగ్గు సమ్మె గట్టి సవాల్‌ విసిరింది. బొగ్గు గనుల్లో వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా జాతీయ స్థాయిలోని ప్రధాన కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా సమ్మెకు నడుం కట్టడం హర్షణీయం.

No comments:

Post a Comment