Tuesday 10 February 2015

అణుప్రమాదం..!

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటనతో బిగిసిన అణు బంధం పెను ముప్పునకు దారితీయనుంది. పౌర అణుసహకార ఒప్పందంలోని అడ్డంకులు తొలగిపోయాయని ఇరు దేశాల నేతలూ ప్రకటించడంతో బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు తలుపులు బార్లా తెరిచినట్లయింది. ప్రమాదభరితమైన అమెరికా కంపెనీల అణు రియాక్టర్లను కొనుక్కుంటే ఎలాంటి భరోసా, బాధ్యత ఆ కంపెనీలకు ఉండనవసరం లేదని మోడీ ప్రభుత్వం లొంగుబాటు వైఖరి ప్రదర్శించింది.తొలి దశలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు పార్కు ప్రాజెక్టు ఒకటి. ప్రమాదవశాత్తు అణువిస్ఫోటనం జరిగితే ఉత్తరాంధ్ర ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అణు ఇంధన, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియాక్టర్లు ప్రమాదానికి గురైతే నివారణ చర్యలు, పరిహారం చెల్లింపు బాధ్యతలను ఆయా కంపెనీలు తీసుకోవు.వాటి గ్యారంటీ, వారంటీల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మోయడానికి అంగీకరించింది. 2013 భూ సేకరణ చట్టం ఉన్నంతలో ప్రజలకు మేలు చేసేదిగా ఉండేది.గతేడాది డిసెంబరు చివరిలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడం, రాష్ట్రపతి ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి.ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇక ముందు గ్రామసభల నిర్వహణ, ప్రజాభిప్రాయ సేకరణ ఉండదు. పాత చట్టం ప్రకారం 80 శాతం ప్రజల ఆమోదం ఉండాలి. సామాజిక ప్రభావ మదింపు నివేదిక కూడా ఉండాలి. ప్రస్తుత ఆర్డినెన్స్‌తో ఆ చట్టబద్ధ హక్కులు హరించబడ్డాయి. రైతులకు, భూ యజమానులకు మాత్రమే పరిహారం అందుతుంది. భూమిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు, వృత్తులతో జీవనం సాగిస్తున్న వారికి, మొత్తం గ్రామీణ జీవనంలో మమేకమైన వారికి ఎలాంటి పరిహారం, భద్రత ఉండదని ఆర్డినెన్స్‌ చెబుతోంది.

No comments:

Post a Comment