Tuesday 17 February 2015

భూస్వామ్య,పెత్తందారీ అహంకారానికి నిదర్శనం..

రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద ప్రజానీకాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి, బాధ్యతారాహిత్యానికే కాకుండా రాష్ట్రంలో పాలక పార్టీ విధానాలకు కూడా అద్దంపడుతున్నాయి. ఎన్నికల ముందు ఎవరికైతే ఆపద మొక్కులు మొక్కారో, కాళ్లావేళ్లా పడి.. బాబ్బాబు అంటూ బతిమలాడారో, ఎన్నికలైన తరువాత వారినుద్దేశించే బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. సుఖాల కోసమే పేదలు వలసలు పోతున్నారంటూ చూపిన వాచాలత ఫక్తు భూస్వామ్య భావజాలానికి, పెత్తందారీతనపు అహంకారానికి నిదర్శనం. చుక్కలు దాటి దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో రెండు పూటల తిండికి హామీ ఇచ్చే రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోవే! ఆ పథకం దారి తప్పుతోందంటే జెసి వంటి పాలకుల అవినీతి, ఆశ్రితపక్షపాతాలే కారణం తప్ప బతుకు బండిని ఈడ్చడానికి నానా కష్టాలుపడే పేద ప్రజలు కాదు.గతంలో టిడిపికే చెందిన మరో ఎంపి గల్లా జయదేవ్‌ ఇదే విధంగా నోరుపారేసుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలకు దిగడం, పేదలకిచ్చే సబ్సిడీలను తొలగించాల్సిందేనంటూ ప్రపంచ బ్యాంకు చేస్తున్న హుకుంల నేపథ్యంలో ఆ తానులో ముక్కలుగా మారిన నేతలే ఇటువంటి మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాలు, స్వార్థ ప్రయోజనాలు, సొంత కుటుంబ ఆస్తుల పెంపే అజెండాగా రాజకీయాలు చేస్తున్న ఈ తరహా నాయకులకు పేదల కష్టాలు అర్థమవుతాయని, వారి కన్నీళ్లను తుడిచి, బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నాలు చేస్తారని ఆశించడం అత్యాశే!

No comments:

Post a Comment