సీఆర్‌డిఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలపడంతో రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని
ప్రభుత్వం నిర్ణయించింది.భూ సమీకరణపై రైతులకు బుధవారం నుంచి నోటీసులు పంపుతామని, ప్రభుత్వం ఏయే అవసరాల నిమిత్తం భూమి తీసుకుంటుందో వివరిస్తూ
నోటీసులిస్తారు. వీటిపై అభ్యంతరం ఉన్నా, భూమి ఇవ్వడానికి ఇష్టంలేకపోయినా 15
రోజుల్లోగా తెలియ జేయాలి.లేదంటే వారు భూమి ఇవ్వడానికి
అంగీకరించినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుని రశీదు
ఇస్తారు. అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా భూమి హక్కు పత్రాలను పరిశీలించి
సంబంధిత హక్కుదారులకు ఆరు నెలల్లోగా బాండ్లు ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ల
ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు వివరిస్తారు. అఫిడవిట్లు, భూమి
హక్కుపత్రాల పరిశీలన పూర్తయిన తరువాత బాండ్లు, కౌలు పరిహారం పంపిణీ
ప్రారంభం అవుతుంది. ఇందుకోసం 27
మంది డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి.
29 గ్రామాల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పరిధిలో
1000 నుంచి 1400 ఎకరాల స్థలం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ
కలెక్టర్ స్థాయి అధికారులను సీఆర్‌డిఏకు కేటాయిస్తుంది. వీరి ఆధ్వర్యంలో
ప్రతి బృందంలో ఇద్దరు తహశీల్దార్‌లు, ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు
సర్వేయర్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సర్వే విభాగం
సిబ్బంది, వీరితోపాటు స్థానిక వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, ఒక కంప్యూటర్
ఆపరేటరు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తం 300 మంది రెవెన్యూశాఖ తరఫున రాజధాని
గ్రామాల్లో పనిచేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని
సంకల్పించామని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు.
No comments:
Post a Comment