Tuesday, 12 May 2015

ఆత్మహత్యల భారతం..


నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360 అయింది. 2013తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైతు ఆత్మహత్యల ఈ మృత్యు ఊరేగింపు నిజానికి భయంకరమైన వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ధారావాహికగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలెన్ని కురిపించినా ఈ కీలకమైన రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. కానీ వ్యవసాయంతోనే జనాభాలో 60 శాతం మంది జీవితం ముడిబడి ఉంది. రైతులను రెండు రాజకీయ ఉద్దేశాల కోసమే వాడుకోవటం జరుగుతోంది. అవి రెండు బ్యాంకులు. ఒకటి ఓటు బ్యాంకు, రెండోది భూమి బ్యాంకు. నేడు ఇక కేవలం విదర్భ లేక మహారాష్ట్రలోనే కాదు, మహమ్మారిలా ఆత్మహత్యల సంఘటనలు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానాలకు వ్యాపించాయి. 2014 ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ ఆత్మహత్యల సంఖ్య 4,004. 1,347 మందితో తెలంగాణ రెండోదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 2011లో ఆత్మహత్యలు సున్నా, 2012లో నలుగురు, 2013లో మరలా సున్నా. గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 755కు పెరిగిపోయింది.

No comments:

Post a Comment