అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని మార్గదర్శకాల ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్దిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అవి అవసరాలకు సరిపడా నీటిసరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం, ప్రజారవాణాతో సహా సమర్థవంతమైన రవాణా సదుపాయాలు, భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం, బలమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటలైజేషన్, సుపరిపాలన ముఖ్యంగా ఈ-గవర్నెన్స్- ప్రజల భాగస్వామ్యం, మంచి పర్యావరణం, పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ, విద్య, వైద్యం. వీటిని గమనిస్తే కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి. క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం. వీటిని అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్ పరిష్కారాలను కూడా చూపించారు. ఉదాహరకు నీటి సరఫరాకు స్మార్ట్ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుద్ధ్యం కోసం చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుద్ధి చేయటం వంటి స్మార్ట్ పరిష్కారాలను పేర్కొన్నారు. నిజానికి మార్గదర్శకాల్లో పేర్కొన్న ఈ స్మార్ట్ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
- యంవి ఆంజనేయులు
No comments:
Post a Comment